తెలుగు చిత్ర పరిశ్రమలో అత్త - అల్లుళ్ల నేపథ్యంలో సాగే అనేక సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి కూడా. ఇటీవలికాలంలో ఈ తరహా చిత్రాల జోరు తగ్గింది. 80-90 దశకంలో విజయవంతమైన ఆ జోనర్‌ని మరోసారి గుర్తు చేస్తూ 'శైలజారెడ్డి అల్లుడు' పేరుతో ఓ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి మారుతి దాసరి దర్శకత్వం వహించగా, అక్కినేని నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించారు.
'భలే భలే మగాడివోయ్'తో కుటుంబ కథలపై మంచి పట్టుందని నిరూపించుకున్న మారుతికి... నాగచైతన్య - రమ్యకృష్ణ కాంబినేషన్ తోడవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 'పండక్కి వస్తున్నాం... పండగ చేసుకుందాం' అంటూ వినాయక చవితి సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ముఖ్యంగా, బాహుబలి వంటి చిత్రంలో శివగామి వంటి పవర్‌ఫుల్ పాత్రలో నటించిన రమ్యకృష్ణ శైలజారెడ్డిగా కనపడుతుందంటే కథలో ఆమెకు ఉన్న ప్రాధాన్యత తెలుస్తోంది. అదీగాక అత్తా, అల్లుడు సినిమా అంటే ఇద్దరి మధ్య కామన్‌గా జరిగే గొడవలున్న సినిమాలను చాలానే చూశాం. మరి ఈ శైలజారెడ్డి అల్లుడు అత్తతో గొడవపడతాడా? లేదా? అనేది తెలుసుకుందాం.
కథ :
సానుకూల దృక్పథం ఉన్న యువకుడు చైతన్య (నాగచైతన్య). ఆయన తండ్రి రావ్ (మురళీ శర్మ). పెద్ద బిజినెస్‌మేన్. పైగా, బాగా అహం ఉన్న వ్యక్తి. ప్రతి చిన్న విషయానికి ఆయన ఇగో ఫీలవుతుంటారు. ఆయన ఇగో కారణంగా కూతురి పెళ్లి కూడా ఆగిపోతుంది. అయితే రావ్ కొడుకు చైతన్యది మాత్రం భిన్నమైన మనస్తత్వం. తను అను (అను ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఆమె ఓ ఆర్టిస్ట్(పెయింటర్). అను మంచి అమ్మాయే అయినా ఆమెలో విపరీతమైన ఇగో ఉంటుంది. ఆ కారణంగా చైతుపై ప్రేమను చెప్పడానికి కూడా ఆలోచిస్తుంటుంది. చివరకు ఎలాగో చైతు ఆమెతో ఐ లవ్ యూ చెప్పించుకుంటాడు. వీరి ప్రేమ వ్యవహారం చైతు తండ్రికి తెలుస్తుంది.
అయితే ఆమెలోని ఇగో చూసి ఆయన కూడా అనుని తన కోడలు చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో ఇగో హార్ట్ కావడంతో అక్కడే చైతు, అనుకి ఇష్టం లేకపోయినా నిశ్చితార్థం జరిపించేస్తాడు. కానీ అప్పుడే అను గురించి అసలు నిజం అందరికీ తెలుస్తుంది. వరంగల్‌కి చెందిన శైలజారెడ్డి (రమ్యకృష్ణ) కూతురే అను. ఆమె తల్లి అనుమతి లేకుండా ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని... దాంతో ఇక ప్రేమ గెలిపించుకోవడం కోసం చైతు వరంగల్ చేరుకుంటాడు. శైలజారెడ్డిని చైతూ ఎలా తమ పెళ్లికి ఒప్పిస్తాడనేదే అసలు కథ. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రంలో రావ్ అనే పాత్ర ఎంత ఇగోయిస్టిక్‌గా ఉంటుందనేదే దానిపై సినిమా ఓపెన్ అవుతుంది. సినిమాలో హీరోను పాజిటివ్ కోణంలో ఎలివేట్ చేశారు. అలాగే హీరో తండ్రిని పోలిన మనస్తత్వంతో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆమెతో హీరో ప్రేమలో పడటం.. తన ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి హీరోయిన్ ఇగోనే అడ్డం పెట్టుకునే సన్నివేశాలు.. సిచ్యువేషన్స్ పరంగా వెన్నెల కిషోర్ కామెడీ.. అంతా ఓకే అనిపిస్తుంది.
రమ్యకృష్ణ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో ఫస్టాఫ్ పూర్తవుతుంది. ఇక హీరో తన ప్రేమ కోసం వరంగల్ వెళతాడు. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్‌కి సినిమా వచ్చేస్తుంది. హీరోయిన్, ఆమె తల్లి రమ్యకృష్ణ మాట్లాడుకోరు. అందుకు ఓ చిన్న కారణం ఉంటుంది. దాన్ని పోగొట్టి.. వాళ్లని హీరో కలపాలనుకోవడం.. అందుకు తగినట్లు వచ్చే సన్నివేశాలు.. చివర్లో హీరో సుదీర్ఘ మైన స్పీచ్‌తో హీరోయిన్ తల్లికి జ్ఞానోదయం కావడం... ఇలానే ఉంటుంది.
ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పరంగా చక్కగా నటించారు. అను ఇమ్మాన్యుయేల్ స్థానంలో మరో హీరోయిన్ ఉండుంటే పాత్రకు ఇంకా న్యాయం జరిగి ఉండేది. రమ్యకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండో భాగమంతా సినిమా ఆమెపైనే నడుస్తుంది. రమ్యకృష్ణ.. శైలజారెడ్డి పాత్రను సునాయసంగా పోషించారు. ఫస్టాప్ కంటే సెకండాఫ్‌లో పృథ్వీ, వెన్నెలకిషోర్ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అయితే సాధారణంగా మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్లో హీరో క్యారెక్టర్ నుండే కామెడీ పుడుతుంది.
కానీ ఈ సినిమాలో ఆ స్కోప్ తక్కువగా కనపడింది. మారుతి దర్శకుడిగా పాత్రల చిత్రీకరణను ఎలివేట్ చేయడంలో సెకండాఫ్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఎమోషన్స్‌తో ఉండాల్సిన సెకండాఫ్ సాదాసీదాగా సాగిపోతుంది. అనుబేబి, ఎగిరే సాంగ్స్ ... బావున్నాయి. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బావుంది. గోపీసుందర్ సినిమాకు అందించిన నేపథ్య సంగీతం కొన్ని సీన్స్‌లో బావున్నాయి. అయితే యాక్షన్ సీన్స్‌లో ఆర్.ఆర్ బాగా లేదు. నిర్మాణ విలువలు బావున్నాయి.
ఇకపోతే, ఈ చిత్ర ప్లస్ పాయింట్స్‌ను పరిశీలిస్తే, నటీనటులు, సినిమాటోగ్రఫీ, ఫస్టాఫ్స, రెండు పాటలు. అలాగే, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, బ్యాగ్రౌండ్ స్కోర్, మారుతి గత చిత్రాల స్థాయిలో కామెడీ లేకపోవడం, సెకండాఫ్ లెంగ్తీగా అనిపించడం, దర్శకత్వం, పాత్రలు, వాటిని తెరకెక్కించిన తీరు ఒకింత నిరాశకు గురిచేస్తాయి.