నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన విక్టరీ వెంకటేష్ - యువ హీరో నాగ చైతన్యలు వెండితెరపై కూడా మామా అల్లుళ్ళుగా నటించిన చిత్రం వెంకీమామ. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి వీరిద్దరి కలయికతో ఓ చిత్రం రావాలన్ని ఇరు కుటుంబాల అభిమానుల కోరిక. ఆ కోరిక నేటికి నెరవేరింది.
వాస్తవానికి మామ అల్లుళ్ల కలయికలో సినిమాల చేయాలని దివంగత నిర్మాత రామనాయుడు కలలు కన్నారు. వెంకీమామతో అభిమానుల నీరిక్షణతో పాటు తండ్రి కలను నిర్మాత సురేష్ బాబు నెరవేర్చారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మామ అల్లుళ్ల కాంబినేషన్‌తో పాటు ప్రచార చిత్రాలు, పాటలతో ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది ఈ సినిమాతో మామ అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచారు? వీరి కాంబినేషన్ సినిమాకు విజయాన్ని తెచ్చిపెట్టిందా? లేదా అన్నది చూద్దాం.
కథ :
గోదావరి తీర ప్రాంతంలో ద్రాక్షారామం గ్రామంలో హరిరామయ్య(నాజర్) చెప్పే జాతకాలను ప్రజలంతా నమ్ముతుంటారు. ఆయన కూతురు మాత్రం తండ్రి నమ్మకాన్ని ఎదురించి ప్రేమవివాహం చేసుకుంటుంది. జాతకదోషం కారణంగా మరణిస్తుంది. ఏడాదివయసున్న ఆమె కొడుకు కార్తిక్(నాగచైతన్య) బాధ్యతల్ని మేనమామ వెంకటరత్నం (వెంకటేష్) తీసుకుంటాడు. కార్తిక్‌ను పెంచి పెద్దచేస్తాడు. మామాఅల్లుళ్లు ఒకరిని విడిచి మరొకరు ఒక్కరోజు కూడా ఉండలేరు. అల్లుడి కోసం తన పెళ్లిని వాయిదా వేస్తుంటాడు వెంకటరత్నం.
మరోవైపు మామకు దూరంగా ఉండటం ఇష్టంలేక ప్రియురాలు హరికతో పాటు లండన్‌లో ఉద్యోగాన్ని కాదనుకుంటాడు కార్తిక్. ఓ సంఘటన కారణంగా మామయ్య క్షేమాన్ని కాంక్షిస్తూ అతడికి చెప్పకుండా దూరంగా వెళ్లిపోతాడు కార్తిక్. కార్తిక్ వెళ్లిపోవడానికి కారణం ఏమిటి? అతడు ఎక్కడకు వెళతాడు? కార్తిక్ వల్ల మేనమామకు పొంచి ఉన్న ప్రమాదమేమిటి? ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న మేనల్లుడిని వెంకటరత్నం ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నడు. వెన్నెలను(పాయల్‌రాజ్‌పుత్) వెంకటరత్నం, హారికను(రాశీఖన్నా) కార్తిక్ పెళ్లాడారా? లేదా? అన్నదే చిత్ర ఇతివృత్తం.
సమీక్ష :
మన భారతదేశానికి చెందిన పలు గొప్ప శాస్త్రాల్లో జాతకం ఒకటి. అసలు జాతకాన్ని నమ్మొచ్చా? లేదా? అనేది వ్యక్తిని బట్టి, అతని ఆలోచని విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలాంటి జాతక శాస్రంలో చెప్పినట్లే జరుగుతుంది అనే కాన్సెప్ట్‌ను బేస్ చేసుకుని తెలుగులో మురారి వంటి సినిమాలు రూపొందాయి.
విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అలాంటి ఓ కాన్స్‌ప్ట్‌తో రూపొందిన చిత్రమే 'వెంకీమామ'. అసలు జాతకాని కంటే మనిషి ప్రేమ గొప్పదని, ప్రేమ చేతిరాతను, తలరాతలను మారుస్తుందని చెప్పడానికి ఈ సినిమాను తెరకెక్కించారు. మామ, అల్లుడు మధ్య ఓ జాతకం వల్ల ఏర్పడ్డ అగాథాన్ని ప్రేమ ఎలా జయించిందనేదే కథ.
వెంకటేశ్ సినిమాకు ఇరుసుగా వ్యవహరించాడు. సినిమాను వీలైనంతంగా తన భుజాలపై మోశాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో వెంకటేశ్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుమ్మేశాడనే చెప్పాలి. ఇక చైతన్య ఇలాంటి పాత్రలో నటించడం కొత్తే అయినా పాత్ర పరిధి మేర, మామను ప్రేమించే అల్లుడిగా చక్కగా నటించాడు. ఇద్దరి మధ్య అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా చూపించిన సన్నివేశాలు బావున్నాయి.
ఎక్కడా ఓవర్‌గా ఏదీ అనిపించలేదు. ఇద్దరి మధ్య ఆ బంధం తెరపై చక్కగా కనపడింది. ఇక పాయిల్ రాజ్‌పుత్, రాశీఖన్నా పాత్రలను చూస్తే రాశీఖన్నా తన గత చిత్రాలకంటే కాస్త గ్లామర్ డోస్ పెంచే నటించిందనాలి. అయితే పాయల్ రాజ్‌పుత్ పాత్రకే పరిధి ఎక్కువగా ఉంది. ఇక పాయల్ రాజ్‌పుత్ టీచర్‌గా నటించినా.. ఆ పాత్ర ఆమెకు నప్పలేదనే చెప్పాలి. ఇక ఫస్టాఫ్ విషయానికి వస్తే మామ అల్లుడి మధ్య అనుబంధం, అసలు వారు ఎందుకు దూరంగా ఉండాలి? అనే విషయాలపైనే కాకుండా ఇద్దరు హీరోలు, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్‌ను చక్కగా తెరకెక్కించారు.
ఫస్టాఫ్ కూల్ కామెడీ, యాక్షన్ పార్ట్స్‌తో సరదాగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఎక్కువ సినిమా రన్ అవుతుంది. క్లైమాక్స్, దానికి ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు మరి కామెడీగా అనిపిస్తాయి. ప్రేక్షకుడికి మరీ విడ్డూరంగా అనిపిస్తాయి. ఇక విలన్స్‌గా నటించిన రావురమేశ్, దాసరి అరుణ్‌లు వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
నాజర్, నాగినీడు, చమ్మక్ చంద్ర, అదుర్స్ రఘు, విద్యుల్లేఖా రామన్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. టెక్నికల్‌గా చూస్తే దర్శకుడు బాబీ సినిమాను తెరకెక్కించిన తీరు బావుంది. అయితే ఫస్టాఫ్ ఉన్నంత బాగా సినిమా సెకండాఫ్ ఆకట్టుకోలేదు.
ముఖ్యంగా క్లైమాక్స్ బాలేదు. తమన్ సంగీతంలో వెంకీ, పాయల్ మధ్య వచ్చే రెట్రో సాంగ్, కొ కొ కోలా పెప్సీ సాంగ్ బావుంది. నేపథ్య సంగీతం ఓకే. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం బావుంది. డైలాగ్స్ కొన్ని సందర్భాల్లో బాగా పేలాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
కాంబినేషన్‌లో తప్ప కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం లేని సినిమా ఇది. వెంకటేష్, నాగచైతన్య అభిమానుల్ని మాత్రమే సంతృప్తిపరుస్తుంది. పోటీగా సినిమాలేవీ లేకుండా విడుదలకావడం వెంకీమామకు కొంత కలిసివచ్చే అవకాశం ఉంది.