సాంకేతిక వర్గం- సినిమాటోగ్రఫీ: ఉదయ్‌సింగ్ మోహితే, దర్శకత్వం : వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, సంగీత దర్శకుడు: స్వప్నిల్ బందోద్కర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ : రోహిత్ శర్మ, ఎడిటర్ : శంఖ్ రాజాధ్యక్ష.
ఇటీవల ఏ సినిమాకూ రాని ప్రచారం `ది కాశ్మీర్ ఫైల్స్`కు వచ్చింది. సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కొంతమంది థియేటర్లలో సినిమా చూసి కళ్ళవెంట నీరు పెట్టుకుంటూ కరతాళ ధ్వనులు చేస్తూ వున్న వీడియోలు మరింత హైప్ తెచ్చాయి. సెన్సార్‌కు ముందు ఇబ్బందులు వచ్చాయన్నారు. బిజె.పి.కి వ్యతిరేకంగా మాట్లాడిన చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమా విడుదలకు ముందు మీడియాతో మాట్లాడుతూ, దేశాన్ని సక్రమార్గంలో తెస్తున్న వ్యక్తి, 370 ఆర్టికల్‌ను రద్దుచేసిన నాయకుడు అంటూ మోదీని మెచ్చుకున్నారు. ఈ సినిమా నిర్మాతలు కూడా మోదీని ఢిల్లీలో కలిశారు. ఆయన అభినందనలు తెలిపారు. దీంతో ఈ సినిమాకు నిర్మాతలకు పెద్దగా ఖర్చులేకుండా ప్రచారం వచ్చేసింది. దాని ఫలితం మార్చి 11న విడుదలైన సినిమా వందకోట్ల క్లబ్‌లోకి చేరింది. మరి ఈ సినిమాలో ఏం ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ.
కశ్మీర్ లోయలో పిల్లలు హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా క్రికెట్ ఆడుకుంటుంటారు. అందులో ఓ పిల్లాడు (శివ) సిక్స్ కొడితే సచిన్‌లా బాగా కొట్టావని మిగిలినవారు అనగానే సచిన్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తాడు. ఇది దూరం నుంచిచూస్తున్న కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్లకు జై కొట్టమంటారు. అయినా వినకపోతే పిల్లాడిని తరుముతారు. శివను ఓ పిల్లాడు తప్పిస్తాడు. కట్‌చేస్తే, కశ్మీర్‌లోయలో వేర్పాటువాదం వున్న 1990 సంవత్సరకాలం. వేర్పాటు వాదులు (టెర్రరిస్టులు) జిహాద్ పేరుతో కశ్మీర్ పండిట్‌లను వెతికి పట్టుకుని మరీ చంపుతారు. పండిట్‌లను మతం మార్చుకోవాలి. లేదా పారిపోవాలి. లేదంటే చావాలి. ఇదీ వారి స్లోగన్. ఇది అల్లా హుకుం అంటూ నినదిస్తారు.
శివ తాత పుష్కర్ నాథ్ పండిట్ (అనుపమ్ ఖేర్). టెర్రరిస్టు గ్రూప్ సభ్యులు పుష్కర్ నాథ్ ఇంటికి వచ్చి కశ్మీర్ వదిలిపోమ్మని బెదిరిస్తారు. నా మాతృభూమి ఇదేనని వెళ్ళనంటాడు. చంపేస్తాం అంటారు. చిన్నప్పుడు నీకు పాఠాలు నేనే చెప్పానని పుష్కర్ నాథ్ టెర్రరిస్టు నాయకుడికి చెప్పినా వినడు. భయంతో పుష్కర్ నాథ్ కొడుకు తన ఇంటిలో బియ్యపు డ్రెమ్‌లో దాక్కుంటాడు. ఇది పక్కింటి ముస్లిం వ్యక్తి చూసి టెర్రరిస్టుకు ఉప్పందిస్తాడు. (ఈ ఉప్పందించిన వ్యక్తి కొడుకే శివను క్రికెట్‌లో గొడవనుంచి కాపాడి తీసుకువస్తాడు). చివరికి టెర్రరిస్టు నాయకుడు పుష్కర్ నాథ్ కొడుకుకు కాల్చి చంపేస్తాడు. అతని రక్తం ధారగా కారుతుంది. అందులో బియ్యం కలిపి పుష్కర్ నాథ్ కోడలిని బెదిరించి తినిపిస్తాడు.
ఇలా ఎన్నో సంఘటనలు ఊరంతా జరుగుతాయి. కశ్మీర్‌లోయలో వున్న మిలట్రీ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకు కారణం ప్రధానమంత్రి, కశ్మీర్ ముఖ్యమంత్రి స్నేహితులు కావడంతో కేంద్రం పండిట్‌ల ఊచకోత గురించి అస్సలు పట్టించుకోదు. పైగా పైస్థాయిలోని మిలట్రీ అధికారులు కూడా కశ్మీర్ ఇష్యూను తప్పుదోవ పట్టిస్తారు మీడియా కూడా వారికి లొంగిపోతుంది. అవాస్తవాలు ప్రచురిస్తారు. చివరికి అసలు వాస్తవం ఏమిటి? అనేది చిన్నతనంలో ఢిల్లీ వెళ్లిపోయిన పుష్కర్ నాథ్ రెండో మనవడు కృష్ణ పెద్దవాడయి కశ్మీర్ వస్తాడు. ఎందుకు తిరిగి వచ్చాడు? ఆ తర్వాత ఏం సాధించాడు? అనేది సినిమా.
విశ్లేషణ-
ఇది పేరుకు పండిట్‌ల ఊచకోతే అయినా మిగిలిన మతాలు, కులాలవారూ ఇక్కడ వున్నారు. వారు బాధలు అనుభవించారు. కానీ వారి గురించి ప్రస్తావన లేదు. ఎందుకంటే మీడియా కూడా ఒకేవైపు వార్తలు రాసేసింది. టెర్రరిస్టులు కూడా తాము చెప్పిందే రాయాలని బెదిరించి రాయించినట్లు అప్పటి జ్ఞాపకాలను ఓ అధికారి వెల్లడిస్తాడు. అలాగే ఆసుపత్రిలోని డాక్టర్‌ను బెదిరించి అక్కడి పేషెంట్ల రక్తాన్ని తమ టెర్రరిస్టు సభ్యుడికి గాయపడితే ఎక్కించాక ఆ రక్తదానం చేసిన వ్యక్తిని చంపేయడం. ఇదేమిటంటే.. అల్లా ఆజ్ఞ అంటూ.. నినాదాలు చేయడం వంటివి వాస్తవాన్ని చూపించినట్లుగా వుంటుంది.
తనకు పాఠాలు చెప్పిన గురువు పుష్కర్ నాథ్ (అనుపమ్ ఖేర్) కోడలిని మీరు నా గురువుగారు కాబట్టి మీ కోడిలిని వదిలేస్తున్నా. లేదంటే నిఖా చేసుకునేవాడిని అంటాడు టెర్రరిస్టు నాయకుడు. అదే నాయకుడుని ఢిల్లీ నుంచి వచ్చిన కృష్ణ ఓ సందర్భంలో కలిస్తే.. ఆమె నాకు చెల్లెలు లాంటిదని నేనెందుకు అలా చేస్తాను. ఇదంతా కట్టుకథ అంటూ చెబుతాడు. అసలు మేమూ మీరూ భాయ్‌భాయ్. కానీ మమ్మల్ని టెర్రరిస్టులుగా వారు చిత్రీకరించారని బొంకుతాడు `వారు ఎవరంటే`.. వారే ఇండియన్ మిలట్రీ అని ఆ నాయకుడు చెప్పేసరికి కృష్ణ బాధతో తిరిగి ఇంటికి వస్తాడు.
ఆ తర్వాత తన తాత స్నేహితులైన మిలట్రీ అధికారులతో కృష్ణ వాగ్వివాదానికి దిగుతాడు. అప్పుడు అధికారులు ఏం చెప్పారు. కృస్ణ ఏం చేశాడనేది సినిమాలో ఆసక్తికర పాయింట్. ఢిల్లీ యూనివర్శిటీ ఎలక్షన్లో పోటీచేయాలనుకున్న కృష్ణకు కశ్మీర్ వచ్చాక అసలు వాస్తవాలు ఏమిటనేవి తెలుస్తుంది. తనను యూనివర్శిటీలో నాయకుడిగా పోటీచేయమని ఎంకరేజ్ చేసిన ఓ మహిళా ప్రొఫెసర్ నిజస్వరూపం కూడా దర్శకుడు చక్కగా చూపించాడు. ఇలా ఎన్నో సంఘటనలు సమాహారాలతో సినిమా తీశారు.
మొదటి భాగంలో కొంతమేరకు చాలా స్లోగా సాగుతుంది. అయితే 30 ఏళ్ళ తర్వాత దీనిపై సినిమా రావడం, ఓ హత్య కేసులో తీర్పు ఎన్నో సంవత్సరాలుగా వచ్చినట్లుగా అనిపిస్తుంది.
- దేశంలో ఓ భాగమైన కశ్మీర్‌లోయలో ఇంతటి దారుణాలు జరుగుతుంటే రాజకీయ నాయకులు స్వార్థంతో ప్రజల్ని ఏవిధంగా టెర్రరిస్టులకు పణంగా పెట్టారనేది ఇందులో ప్రధాన అంశం. దీనిని మరింతగా చెప్పగలిగితే బాగుండేది.
- ఆర్టికల్ 370ని అప్పటి కేంద్రం ఎందుకు తొక్కిపెట్టింది అనేది కూడా సున్నితంగా చర్చించాడు.
- ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా అధికారం, ఆర్థికబలం వున్నవారిదే పైచేయి. ఈ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది.
- హైలైట్ ఏమంటే.. యూనివర్శిటీలోని కృష్ణ పాత్ర ద్వారా అసలు కశ్మీర్ అనేది దేశంలో ఎంత ఉన్నతంలో వుందో, మునులు, రుషులు, బుద్ధుడు, శంకరాచార్యులు, మేథావులు, సైంటిస్టులు ఎంతోమంది తెలివైన వారు వడుగిడిన నేల. అలాంటి ఈ ప్రాంతాన్ని టెర్రరిస్టులు ఎందుకు ఆక్రమించుకున్నారనే విషయాలు యూనిర్శిటీలో విద్యార్థులకు స్పీచ్ ఇస్తాడు. ఇదంతా స్టడీచేసి తెలుసుకున్నవే. అసలు నిజాలు తీయకుండా ఫేక్ కథలు పుస్తకాల్లో చొప్పించారు అని వాదిస్తాడు. కృష్ణ
ఇంత చెప్పినా కొందరు విద్యార్థులు నమ్మరు. విషయాలు తప్పని వేలెత్తి చూపుతారు. అలాంటి టైంలో కృష్ణ వారికి ఎటువంటి కనువిప్పు ఇచ్చాడనేది ముగింపు. అయితే షడెన్‌గా ముగింపు ఇచ్చేశాడు దర్శకుడు.
- అప్పట్లో బిజెపి నాయకులు అటల్‌జీ వంటివారు ఎంతో మంది వున్నారు. వారు ఏమి చేశారనేది కూడా కృష్ణ ప్రశ్నిస్తాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తే కలుగుతాయి. ఫైనల్‌గా కశ్మీర్ పండిట్‌ల ఊచకోతను దర్శకుడు చూపించాలనికుని చూపించాడు. అందుకు అభినందనీయమే.
- అయితే, అంతకంటే ఘోరంగా మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఇండియానుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుండి ఇండియాకు రైలులో పారిపోతున్న ప్రజలను ఎంతఘోరంగా ఊచకోత కోసి చంపారు. ఆడవారిని ఏవిధంగా బలవంతం చేశారనే కథలు చరిత్ర పుటల్లో చాలా వున్నాయి. తెలంగాణలో రజాకార్త ఉద్యమం కూడా అటువంటిదే.
- ఇక, జలియన్ వాలాబాగ్ ఉదంతం తరహాలో ఈ సినిమాలో ముగింపు ఓ సన్నివేశంగా దర్శకుడు చూపించాడు.
- మరి వీటన్నింటికీ బాధ్యులు ఎవరు? ఎవరనేది తెలిసినా ఏమీ చేయలేని అభాగ్యులు ప్రజలు. అందుకే కవులు, రచయితలు, దర్శకులు ఇలాంటి రచనలు రాస్తూ, సినిమాలు తీసి పౌరులుగా తమ బాధ్యతని నిరూపిస్తుంటారు వారికి హాట్సాప్ చెప్పాల్సిందే.