డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

దేవీ

గురువారం, 27 మార్చి 2025 (16:56 IST)
Naga chaitanya with Mad gang
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. మార్చి 28న థియేటర్లలో అడుగుపెడుతోంది.  ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా నిర్వహించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు మారుతి, వెంకీ అట్లూరితో పాటు చిత్ర బృందం పాల్గొంది.
 
ఈ సందర్భంగా ముఖ్య అతిథి అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ, "మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ, ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్ గా ఉన్నప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్ షిప్ ని స్ట్రాంగ్ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాయి. మ్యాడ్ లాంటి సినిమాలు రావడం సంతోషంగా ఉంది. మ్యాడ్ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు స్టార్స్ అయిపోయారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా వీళ్ళ పేర్లను గుర్తు పెట్టుకుంటారు. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నె నితిన్, రామ్, సంగీత్ లో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు.

ఒక స్టోరీ డిస్కషన్ లో దర్శకుడు కళ్యాణ్ తో కూర్చున్నప్పుడు ఆయన నేరేషన్ కే పడిపడి నవ్వాను. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించగలను. నా ఫేవరెట్ డీఓపీ శామ్‌దత్ గారు ఈ సినిమాకి పనిచేశారు. నిర్మాతగా హారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నాది, నాగవంశీ జర్నీ ప్రేమమ్ తో మొదలైంది. తన ధైర్యమే నాగవంశీని ఇంతదూరం తీసుకొచ్చింది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. అలాగే నిర్మాత చినబాబు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. మ్యాడ్ స్క్వేర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మ్యాడ్ 2 మాత్రమే కాదు, మ్యాడ్ 100 కూడా రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.
 
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, "నేను మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చాను. ఆ సమయంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ పేర్లు అప్పుడప్పుడే తెలుస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఈ ముగ్గురు ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ముగ్గురు కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి నేను పగలబడినవ్వాను. హారిక మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు రెండో సినిమాతో ఇంకా పెద్ద హిట్ అందుకుంటారనే నమ్మకం ఉంది. భీమ్స్ గారు స్వరపరిచిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు