రాన్న, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ఏలుమలై. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ టైటిల్ టీజర్‌ను గురువారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు బెంగళూరులోని ఓరియన్ మాల్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ టీజర్‌ను కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ఆవిష్కరించారు. డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ ఈ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు, నటుడు జోగి ప్రేమ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చూడన్నా.. నిన్ను చూస్తుంటే వేరే ఊరి నుంచి వచ్చినట్టు అనిపిస్తోంది.. అసలు నిన్ను అతను ఎక్కడ కలిశాడన్నా అంటూ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ చేసిన టైటిల్ టీజర్‌ను చూస్తుంటే లవ్, ఫ్యామిలీ, యాక్షన్, థ్రిల్లర్ జానర్లను కలిపి అద్భుతంగా తీసినట్టు అనిపిస్తుంది. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంది హరీష్ వల్లే అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్.. చివర్లో చిన్ని అంటూ హీరో పిలిచిన పిలుపు.. హరీష్ ఎక్కడున్నాడు సర్ అంటూ ఎండ్ చేసిన టైటిల్ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఏలుమలై సినిమాలో రక్షిత సోదరుడు రాన్న ప్రధాన పాత్రలో నటించారు. మహానటి ఫేమ్ ప్రియాంక ఆచార్ రాన్న సరసన నటించారు. ఈ టైటిల్ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. విజువల్స్, ఆర్ఆర్ ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. ఇక రాన్న స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఫిదా చేసేలా ఉన్నాయి. ప్రియాంక సహజ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అనంతరం శివన్న మాట్లాడుతూ .. టీజర్ అద్భుతంగా ఉంది. మంచి వ్యక్తులకు మంచి జరుగుతుందని టైటిల్ టీజర్ రుజువు చేస్తుంది. రాన్నా చాలా గొప్పగా నటించాడనిపిస్తోంది. ప్రియాంక అస్సలు కొత్త అమ్మాయిలా అనిపించలేదు. కొత్తవారు, న్యూ టాలెంట్ వచ్చి కొత్త చిత్రాల్ని తీయాలి. ఇలాంటి కొత్త వారిని ఆడియెన్స్ ఆదరించి, విజయాన్ని చేకూర్చాలి అని అన్నారు.
నిర్మాత తరుణ్ సుధీర్ మాట్లాడుతూ, ఏలుమలై పట్టణం, మాలే మహదీశ్వర ఆలయం గురించి శివన్న, జోగి గొప్ప చిత్రాల్ని తీశారు. ఈ రోజు టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయడం మాకు గర్వంగా ఉంది. ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో మంచి ధరకు సొంతం చేసుకుంది. నిజానికి టైటిల్ ప్రకటించకముందే సినిమా అమ్ముడైంది అని అన్నారు.
దర్శకుడు పునీత్ రంగస్వామి మాట్లాడుతూ .. ఇది ప్రేమకథ మాత్రమే కాదు.. ఇందులో ఓ గొప్ప సంఘర్షణ ఉంటుంది. యథార్థ ఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుంది. మా టీజర్‌ను రిలీజ్ చేసిన శివన్నకు థాంక్స్ అని అన్నారు. చౌక, కాటేర చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మించిన ఈ చిత్రానికి అట్లాంట నాగేంద్ర సహ నిర్మాతగా వ్యవహరించారు.
కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం మరియు ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది.