అమ్మా...!! అన్నం తిని రెండు రోజులైంది

FILE
అదిగో జూబ్లి హిల్స్ చెక్ పోస్టు సిగ్నల్ వచ్చేస్తోంది.... యధాలాపంగా నా చేయి హ్యాండ్ బ్యాగులోని చిల్లర డబ్బుల కోసం వెతకసాగింది. ఇంతలో సిగ్నల్ పడింది... కానీ ఏవి.. నేను వెతికే ఆ కళ్లు... కనిపించవేం? అరే 2... 3... 4.. నిమిషాలు గడిచిపోతున్నాయి. సిగ్నల్ మారింది... ఆటో కదులుతోంది.

సరిగ్గా అప్పుడే నా ఆటోలోకి రెండు చేతులు తోసుకుంటూ వచ్చాయి. ఒకటి చిక్కి శల్యమైన బక్క చేయి.. మరోటి చిన్నారి చిట్టి చేయి... ఎందుకో నాకు ఆ రెండు చేతులను చూసిన వెంటనే సంతోషం వేసింది. ఎంతో ఆనందంతో బ్యాగులోనుంచి తీసిన డబ్బును బలహీనమైన ఆ చేతికి బలాన్నిస్తున్నట్లు తలచుకుంటూ ఆమె చేతిలో ఉంచి.. తీయటి చాక్లెట్‌ని చిన్ని చేతికి అందించా...

ఈ తతంగమంతా చూస్తున్న ఆటో డ్రైవర్‌కి చిరాకెత్తిందేమో విసుక్కున్నాడు. "మీలాంటి వాళ్ల వల్లే ఈ అడుక్కు తినే వాళ్లు పెరిగిపోతున్నారు. ఏం మేడమ్ చదువుకున్న మీరు ఇలా చేయడం కరెక్టా?" అంటూ పాఠాలు చెప్పడం మొదలెట్టాడు. కానీ నేను అతని మాటలు వినే స్థితిలో లేను.

కళావిహీనమైన వారి ముఖాల్లో నేనిచ్చిన ఆ కాస్త డబ్బు వేయి ఓల్టుల శక్తిని చేకూర్చినట్లు అనిపిస్తోంది. ఆటో ముందుకు వెళుతున్నా.. వెనక్కి తిరిగి మలుపు తిరిగే వరకూ వారినే చూస్తూ ఉన్నా. ఆ మలుపు ముగిసిన తర్వాత.. ఆటో డ్రైవర్ పదే పదే గొణుగుతున్న మాటలు తలకెక్కాయి. ఇంతకీ ఆటో అతను చెబుతున్నట్లు నిజంగా నేను చేస్తుంది తప్పా???
కన్నీటి చారలతో.... ఆ కళ్లు
అమ్మా... అన్నం తిని రెండు రోజులైంది. బాబుకి పాలు తాగించడానికి చిల్లర లేదు. ఓ రూపాయి ఉంటే ఈయ్యమ్మా.. నీ కాళ్లు మొక్కుతా అంటూ... నిండా పాతిక దాటకున్నా, నిండు ముసలితనపు ఛాయలతో ఎండిన కన్నీటి చారలతో... ఆ కళ్లు అతి దీనాతిదీనంగా నన్ను అర్థించడం... ఓహ్!!


నా ఆలోచనలు మళ్లీ ఆటోతో పాటే వేగంగా పరిగెత్తసాగాయి. ఈ దారిలో గత ఏడాదిగా నా ఆఫీసుకు ఆటోలో వెళుతూనే ఉన్నాను. మొదట్లో హైదరాబాదు నగరంలో సిగ్నల్ పడి ఆగినప్పుడల్లా ఎన్నో చేతులు సాయమడిగి నన్ను ఇబ్బంది పెట్టేవి. ఆ చేతులను చూసినప్పుడు నాలో ఏదో తెలియని అలజడి. ఏదో తెలియని బాధ.. నిస్సహాయత.. రోజంతా మనసును ఆవరించేది.

సంవత్సరం క్రితం.. అమ్మా... అన్నం తిని రెండు రోజులైంది. బాబుకి పాలు తాగించడానికి చిల్లర లేదు. ఓ రూపాయి ఉంటే ఈయ్యమ్మా.. నీ కాళ్లు మొక్కుతా అంటూ... నిండా పాతిక దాటకున్నా, నిండు ముసలితనపు ఛాయలతో ఎండిన కన్నీటి చారలతో... ఆ కళ్లు అతి దీనాతిదీనంగా నన్ను అర్థించడం... ఓహ్!! నేనెన్నటికీ మరిచిపోలేను. ఆ క్షణం నా హృదయం ద్రవీభవించింది. అప్పుడు నా చేతిలో ఎంత డబ్బు ఉందో తెలియదు కానీ... ఉన్నదంతా ఇచ్చేశాను. ఆ తర్వాత ఆమె వంక అలా చూశాను.

ఆమె కళ్లు... నాకు మీలాగే బ్రతికే హక్కు లేదా? అంటూ ప్రశ్నిస్తున్నట్లనిపించింది. చిరుగు పాత చీర, శరీరాన్ని సరిగా దాచలేని రవిక.. ఆ వస్త్రధారణ.. సాటి మనిషి ఇలా దీనావస్థలో ఉంటే ఆదరించే బాధ్యత నీకు లేదా? అంటూ నిలదీస్తున్నట్లనిపించేది.

తలదాచుకునేందుకు గూడు లేక ఎండకు ఎండి, వానకు తడిసి అమ్మతో పాటే జోలెలో తిరుగాడే ఆ ఏడాది వయసు చిన్నారి... నేనేం పాపం చేశానని నాకీ శిక్ష అంటున్నట్లుండే ఆ అమాయకపు చిన్ని కళ్లను చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగేవి.

ఆ రోజే ఓ నిర్ణయం తీసుకున్నా... నాకు తోచిన సాయం చేయాలని. ఇవ్వగలిగినంత, వారికి ఉపయోగపడే వస్తువులనో ఇవ్వాలని. ఎదురుగా నా కళ్లముందు ఓ జీవితం అణగారిపోతుంటే ఎందుకో నా మనసు భరించలేక పోతోంది. అందుకే దృఢంగా నిర్ణయం తీసుకున్నా. అంతే... రోజూ నన్ను వెంటాడే ఆ కలత ఎగిరి పోయింది.

కానీ ఆటో అబ్బి నేను చేసేది తప్పు అంటున్నాడు. అతను అంటున్నట్లు పేదరికాన్ని ప్రోత్సహించడం తప్పే... కానీ ఏ పని చేయలేక నడిరోడ్డున పడ్డ దీనులను ఆదుకోకపోతే... వారికి ఇక దిక్కెవ్వరు? ఒక్కసారి అలా ఆలోచన వచ్చినప్పుడు కంటి ముందు ఉన్న అడ్డు తెరలు పటాపంచలైనాయి. నా మార్గం స్పష్టంగా దేదీప్యమానంగా కనబడుతోంది. ఇప్పుడు నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది.

నిజం చెప్పాలంటే... నేను చేసేది తప్పో... కరెక్టో ఆలోచించే స్థితిలో నా మనసు లేదు. ఆ యాచకురాలి కళ్లల్లో తృప్తి, చిట్టి కళ్లల్లో ఆనందం మాత్రమే నాకు కనిపిస్తోంది. అంతే!!
- డాక్టర్ మాధురీ కృష్ణ

వెబ్దునియా పై చదవండి