ఎవర్నయినా భిక్షగాడినే....

ఉగాది రోజు వెంకటేశ్వరస్వామి గుళ్ళో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భగవద్దర్శనం త్వరగా ముగించుకుని పూజారి ఇచ్చిన తీర్ధప్రసాదాలు స్వీకరించి బయట పడ్డ రాకేష్‌ను భిక్షగాళ్ళు చుట్టుముట్టారు. అందర్నీ తప్పించుకొని ముందుకు వెళ్తున్న అతడ్ని "ఏమండీ! అలా చూడండి. భిక్షం కూడా అడుక్కోకుండా గుడి ముందు భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఎంత భక్తిగా ఉన్నాడో" ఒంటి మీద నామాలతో ముందు భిక్షాపాత్రతో మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చున్న భిక్షగాణ్ణి గూర్చి భర్తతో చెప్పింది మాలతి.

అతడి వంక చూసిన రాజేష్‌కి ఎందుకో అతడికి భిక్షం వేయాలనిపించి జేబులోంచి రూపాయి బిళ్ళ తీసి అతడి ముందున్న బిక్షాపాత్రలో వేశాడు. అప్పటికే అతడి భిక్షాపాత్ర దాదాపు రెండింతలు చిల్లర నాణాలతో నిండి వుంది.
స్కూటర్ మీద ఆఫీసుకి వెళ్తున్న రాకేష్‌ని దారిలో ఒక వ్యక్తి ఆపి "సార్ అర్జెంటుగా మసీదుకు వెళ్ళాలి. నమాజ్ టైం అయిపోతుంది దయ వుంచి కొద్దిగా మసీదు వరకు లిఫ్ట్ యివ్వండి" అని అడిగేసరికి కాదనలేక అతడ్ని ఎక్కించుకొని మసీదు ముందు స్కూటర్ ఆపాడు. అతడు దిగిన తర్వాత స్కూటర్ స్టార్ట్ చేయబోయిన రాకేష్ కాకతాళీయంగా మసీదు ముందు భిక్ష కోసం కూర్చున్న ఫకీరును చూసి ఎందుకో స్టార్ట్ చేయకుండా నిలబడిపోయాడు.

అందుకు కారణం ఆ ఫకీరుని ఎక్కడో చూసినట్లు అన్పించడమే! ఆలోచించగా ఆరోజు ... అదే ఉగాది రోజు వెంకటేశ్వరస్వామి గుడి ముందు ఒళ్ళంతా నామాలతో భక్తిగా కూర్చున్న భిక్షగాడు, ఈ ఫకీరు ఒక్కడే అని గుర్తించిన రాకేష్ 'ఇంత మోసమా' అనుకుని అతడి దగ్గరకు వెళ్ళి-"ఉగాది రోజు వెంకటేశ్వరస్వామి గుడి వద్ద నామాలు పెట్టుకుని కూర్చుంది నువ్వే కదూ?" అని ప్రశ్నించేసరికి
"అవును నిజమే.." కొంచెం తడబడుతూ సమాధానం ఇచ్చాడు ఫకీర్.
"అసలు నువ్వు హైందవుడివా? మహమ్మదీయుడివా?" ప్రశ్నించాడు రాకేష్.
"ఎవర్నయినా నేను భిక్షగాణ్ణే... నా పూట గడవడం కోసం హైందవుల పండుగ రోజు వెంకటేశ్వరస్వామి గుడి ముందు భక్తిగా కూర్చుంటాను. అలానే శుక్రవారం మసీదు ముందు ముస్లింగా, ఆదివారం చర్చి ముందు క్రైస్తవునిగా అలంకరించుకుని అడుక్కుంటాను" అని అన్నాడు ఫకీరు.

సర్వ మతస్థులను సమానంగా చూస్తూ అడుక్కుంటున్న అతడ్ని అభినందించాలా? లేక ఇలా వేషాలు మారుస్తూ మోసం చేస్తున్నందుకు నిందించాలా? ఏదీ తేల్చుకోలేక పోయాడు రాకేష్.

వెబ్దునియా పై చదవండి