మార్పు

మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (20:25 IST)
డైరెక్టర్ సూచనల మేరకు ఎంతో వయ్యారంగా నటిస్తోంది ఆంజలి. ఆంజలి డ్రస్సు ఎంతో సెక్సీగా ఉంది. దానికి తోడు ఆమె నటన మరీ సెక్సీగా ఉంది. "కట్!" అరిచాడు డైరెక్టర్ శేఖర్. శేఖర్ తీసిన సినిమాలంటే ఎగబడి మరీ చూస్తారు ఆంధ్రదేశ్ ప్రజలు. అందుకు ముఖ్య కారణం అతడు తీసిన సినిమాల్లో హీరోయిన్స్‌ని ఎంతో సెక్సీగా చూపించడమే.

శేఖర్ సినిమాల్లోని హీరోయిన్స్‌లా అలంకరించుకొని తిరగడం ప్రస్తుత కాలేజీ బ్యూటీలకు క్రేజీ. కేవలం కాలేజీ బ్యూటీలేకాదు. బయటి బ్యూటీలు కూడా శేఖర్ హీరోయిన్స్‌ను అనుకరించసాగారు. ఆంజలి నెక్స్ట్ సీన్‌కి రడీ అయింది. "స్టార్ట్! యాక్షన్!" మెగాఫోన్‌లో అరిచాడు శేఖర్. ఎంతో సెక్సీగా నటిస్తోంది ఆంజలి. ఆ దృశ్యాన్ని మౌనంగా తనలో దాచుకుంటోంది మూవీ కెమెరా.

"కట్! లంచ్ బ్రేక్" అన్నాడు శేఖర్. యూనిట్ సభ్యులందరూ ఆహారం కోసం ఎగబడ్డారు. డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, స్పెషల్ రూంలోకి వెళ్ళారు స్పెషల్ ఫుడ్ కోసం. ఆంజలి డ్రస్సుమీద జోకులేస్తూ టేకులెలా తీసింది చెప్తూ భోజనం చేస్తున్నాడు శేఖర్. అప్పుడు ..."సార్! మీకు అర్జంట్ ఫోన్" అంటూ శేఖర్‌తో చెప్పాడు అతని అసిస్టెంట్.

"నాకా! అర్జంటా!" అని ఆశ్చర్యపోతూ "వస్తున్నా" అంటూ ఆతృతగా పైకి లేచాడు శేఖర్. రిసీవర్ చెవిదగ్గర పెట్టుకొని.." శేఖర్ స్పీకింగ్" అన్నాడు. "సార్! నేను టూ టౌన్ ఎస్.ఐని మాట్లాడుతున్నాను. మీరు అర్జంటుగా స్టేషన్‌కి రావాలి. ఫోన్లో చెప్పే విషయం కాదు". విన్పించింది అవతలి కంఠం. 'ఏమిటంత అర్జంటు ఏమైవుంటుంది?' అనుకొని అలాగే అని ఫోన్ డిస్కనెట్ చేశాడు.

"అర్జంటుగా టు టౌన్ పోలీస్ స్టేషనుకు వెళ్ళి" కార్లో కూర్చుని డ్రైవ‌ర్‌తో చెప్పాడు శేఖర్. కారు పోలీసు స్టేషన్ ముందు ఆగింది. గబగబా స్టేష‌న్‌లోకి వెళ్ళాడు శేఖర్. "రండి కూర్చోండి సార్! మీకో దుర్వార్త చెప్పవలసి వచ్చింది" అని ఆగి, "మీ అమ్మాయి సుమ దారుణంగా రేప్ చేయబడింది. రేప్ చేసిన వాళ్ళను లోపల వేశాను. కేసు రిజిష్టర్ చేయాలా? వద్దా? అని మిమ్మల్ని పిలిపించాను. ప్రస్తుతానికి మీ అమ్మాయిని ఇంటికి పంపేశాను.

మీ అభిప్రాయం చెప్తే కేసు రిజిష్టర్ చేయాలి" అన్నాడు ఎస్.ఐ. "ముక్కు పచ్చలారని నా చిన్నారి తల్లిని రేప్ చేసేదానికి వారికి చేతులెలా వచ్చాయి?" అని భోరున ఏడ్చాడు. "రేప్ చేసిన వెధవలు సెల్‍‌లో వున్నారు చూడండి" సెల్ వైపు చోత్తో చూపిస్తూ చెప్పాడు ఎస్.ఐ. "మా అమ్మాయి మీకేం ద్రోహం చేసిందని రేప్ చేశారు?" ఏడుస్తూ సెల్ లోని వారిని ప్రశ్నించాడు శేఖర్.

"ఆ అమ్మాయి వేసుకున్న డ్రస్సూ! ఆ నడకా! మమ్మల్ని రెచ్చగొట్టాయి. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా చేసుకోలేకపోయాం" ముక్త కంఠంతో చెప్పారు సెల్‌లో వున్న ముగ్గురు యువకులు. "ఇదండీ! మీ అమ్మాయి వేసుకున్న బట్టలు" అని చూపించాడు బట్టల్ని ఎస్.ఐ. అవి చూసిన శేఖర్ కళ్ళముందు ఈ రోజు సెట్‌లో ఆంజలి వేసుకున్న బట్టలు కన్పించాయి.

ఎస్.ఐ చేతిలో ఉన్నదానికంటే ఇంకా ఘోరంగా ఉంటుంది ఆంజలి డ్రస్సు. రేపు ఆంజలి డ్రస్సుని ఇంకొకరు అనుకరించవచ్చు. అంటే ఈ రేప్‌కి పరోక్షంగా నేనే కారకుడినన్న మాట. అని మనస్సులోపల అనుకొని ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా -"ఎస్.ఐ గారూ! సెల్ లోని యువకుల్ని వదిలేయండి" అని వెళ్ళిపోయాడు శేఖర్. వెళ్తున్న అతనిలో ఏదో తెలియని మార్పు కన్పించింది ఎస్.ఐకి.

వెబ్దునియా పై చదవండి