రోజులు మారాయి...

మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (19:57 IST)
రాఘవయ్య మాస్టారు బజారుకెళ్ళడం కోసమని అలా నడచి వెళ్తున్నప్పుడు -"నమస్తే మాస్టారూ!" అని వినయంగా నమస్కరించాడు అజయ్ కుమార్. "బాగున్నావా అజయ్? కన్పించి చాలా రోజులైంది.""బాగున్నాను మాస్టారూ! ఈ మధ్య ఎస్.ఐ సెలక్షన్ టెస్టు వుంటే అందుకు ప్రిపేరు అవుతుండడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయాను మాస్టారూ!" అని వినయంగా చెప్పాడు అజయ్ కుమార్.

"టెస్టు బాగా రాశావా?", "బాగా రాశాను మాస్టారూ! తప్పకుండా సెలక్టు అవుతానన్న నమ్మకం కూడా వుంది". అజయ్ టెన్త్ క్లాసు వరకూ రాఘవయ్య మాస్టారు దగ్గరే చదువుకున్నాడు. ఆతర్వాత డిగ్రీ కూడా అదే ఊర్లో చదివాడు. "హాయ్! మిస్టర్ రాఘవయ్యా! అంటూ నోట్లోని సిగరెట్ పొగ మాస్టారు పక్కనున్న అజయ్ మొహం మీదకు ఊదుతూ విష్ చేశాడు బాచీ.

"ఏంటి బాచీ! బాగున్నావా?" అని పలుకరించారు రాఘవయ్య మాస్టారు మర్యాదగా. "నేను బాగా వుందీ లేనిదీ కన్పిస్తూనే వుందిగా!". చిన్నప్పటినుంచీ అడ్డూ అదుపూ లేకుండా పెరిగాడు బాచీ. ఇన్స్‌పెక్షన్‌కు వచ్చినట్లు స్కూలుకు వచ్చేవాడు. రాఘవయ్య మాస్టారు ఏదన్నా మంచి మాటలు చెప్పి అతడ్ని మార్చాలని చూస్తే, "నీ పని నువ్వు చూసుకో" అని రెక్‌లెస్‌గా చెప్పేవాడు.

"నిన్ను చూస్తుంటే నువ్వు ఇంకా మారలేదనిపిస్తుందిరా బాచీ" అన్నాడు అజయ్. "నేను మారకపోతే నీకెందుకు కానీ ఇంకా ఉద్యోగం సద్యోగం లేకుండానే వున్నావా! చూడు మిస్టర్ రాఘవయ్యా! అందరికన్నా గొప్ప స్థాయిలో ఈ అజయ్ వెళ్తాడని చెప్పేవాడివిగా! ఏదీ పాపం ఉద్యోగం సద్యోగం ఏమీ లేదే!" అని గేళి చేశాడు బాచీ.

"అజయ్ స్థాయి త్వరలోనే తెలుస్తందిలే బాచీ! అజయ్ పద వెళ్దాం" అని అక్కడి నుంచి కదిలారు. "అజయ్! బాచీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించాడు మాస్టారు. "ఏముంది మాస్టారూ! చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళను చేరదీసి వాళ్ళ దగ్గర కమీషన్లు తీసుకోవడం, రౌడీయిజం చెలాయించడం చేస్తూ, బ్రతికేస్తున్నాడు."

సంవత్సరం తర్వాత రాఘవయ్య మాస్టారు ఇంటికెళ్ళిన అజయ్ కుమార్ "మాస్టారూ! నన్ను ఈ ఊరికే ఎస్,ఐ గా వేశారు. ఈ రోజు స్టేషన్‌కెళ్ళి చార్జ్ తీసుకోవాలి. నేను చార్జ్ తీసుకునే సమయంలో మీరు పక్కనుంటే సంతోషంగా వుంటుంది". అని రిక్వెస్ట్ చేశాడు.

తన శిష్యుడు ఉన్నతుడయ్యాడన్న గర్వంతో పొంగిపోయి ఆనందంగా అజయ్‌తో కలిసి పోలీసు స్టేషన్ కెళ్ళాడు. అజయ్ చార్జ్ తీసుకున్న తర్వాత మాస్టారుకు సగౌరవంగా సెల్యూట్ కొట్టాడు. అప్పుడే స్టేషన్‌లోకి అడుగుపెట్టిన ఆ ఊరి ఎమ్.ఎల్.ఏ - "ఏమయ్యా ఎస్.ఐ! కొత్తగా సర్వీసులో చేరావు. ఈ ఊరు నాది.

నువ్వు దీన్ని జాగ్రత్తగా చూసుకో. అవసరమైతే నా దగ్గరకురా హోం మినిస్టరు మనోడే. మొహమాటపడకు వస్తా, అర్జెంటు పనులున్నాయ్" అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. కుర్చీలో కూర్చున్న రాఘవయ్య మాస్టారు మాత్రం వెళ్తున్న ఎమ్.ఎల్.ఏ వంక ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అందుకు కారణం ఎమ్.ఎల్.ఏ బాచి కావడమే.

వెబ్దునియా పై చదవండి