అది ఆదివారం అర్థరాత్రి సమయం. కటిక చీకటి.... రోడ్డు ఇరు వైపుల ఉన్న పొడవైన చెట్లు పురివిప్పుకుని తాండవిస్తున్న భూతల సవ్వడి చేస్తున్నాయి. ఆ వేళలో ఎటువంటి భయం లేకుండా వెలుతురు కంటే కూడా వేగంగా దూకువెళుతోంది ఓ యువతి. ఆమె పేరు జనని
ఎలాగైనా చనిపోవాలి... నడుస్తున్న ఆమె ఎంతో స్థిరంగా అనుకుంది. అయితే ఎలా చనిపోవాలి? వెంటనే ప్రశ్నించుకుంది. నడుస్తూనే ఆలోచించింది. ఊరికి దూరంగా వున్న పాడుబడిన బావిలో దూకి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో నడక వేగాన్ని మరింత పెంచింది. వేగంగా నడుస్తున్న ఆమె కంటికి బావి కన్పించింది. అంతే క్షణంలో బావి గట్టు మీద నిల్చుని భగవంతుడా 'నేను చేసిన తప్పుకి ఇదే శిక్ష' నాకు ప్రశాంతమైన చావును అందించు అంటూ తన ఇష్టదైవాన్ని మనసారా ప్రార్థించి బావిలోకి దూకేసింది.
నీళ్ళలో పడేలోపే... ఒక్కసారిగా మెలకువ వచ్చి ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చుంది. ఓస్ ఇదంతా కలన్న మాట? అనుకుంది. వెంటనే.. కలలోనే కాదు నిజంగానైనా కిషోర్ విషయం తల్లిదండ్రులకు తెలిసిన రోజు జరగబోయేది కూడా ఇంతే కదా అనుకుంది. అందరి ముందూ ఎంతో గొప్పగా, గర్వంగా తలెత్తుకుతిరిగేవాడ్ని అలాంటి నన్ను ఈ రోజు అందిర ముందూ తలదించుకునేలా చేశావు కదే... అంటాడు తండ్రి.
దాన్ని గురించి ఇంకా ఎందుకండీ మాట్లాడడం? అది చచ్చిందనుకుంటే సరిపోతుంది అంటుంది తల్లి. చచ్చిందనుకుంటే సరిపోదు. నిజంగా చనిపోతేనన్నా మన పరువు కొద్దిగానన్నా మిగుల్తుంది అంటాడు తండ్రి. కనుక అప్పుడైనా చావక తప్పదు. ఎలాగూ చావాలి కనుక కిరణ్ విషయం తల్లిదండ్రులకు తెలియకముందే చెప్పేస్తే? అనుకుంది జనని. చచ్చి ఏం సాధిస్తావే పిచ్చిదానా వెంటనే ప్రశ్నంచింది జనని అంతరాత్మ.
అవును. చచ్చేం సాధిస్తాను? ఏమీ సాధించలేను. కిరణ్కేం హాయిగా వుంటాడు. నో ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అని తీవ్రంగా ఆలోచించసాగింది. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అన్నది అర్థగంట ఆలోచనల తర్వాత నిర్ణయించుకొంది. అంతే ఒక్క ఉదుటున అర్థరాత్రి సమయంలో మంచం దిగింది. ఆడది అబల కాదు. ఆడదాన్ని మోసం చెయ్యడం తేలిక కాదని నిరూపిస్తాను అని స్థిరంగా అనుకుంది. తల్లికీ, తండ్రికి తెలియకుండా మెల్లగా ఇంటిలోంచి బయటపడింది. కిషోర్ పెళ్ళి తెల్లవారుజామున నాలుగు గంటలకు.
నేను చేయబోయే పనికి కేవలం నాలుగు గంటలు వ్యవధి మాత్రమే ఉంది. ఆ లోపల? ఆపై ఎందుకో ఆలోచించలేక పోయింది. వేగంగా నడుస్తోంది జనని... ఆమె చుట్టూ కటిక చీకటి.. నడుస్తున్న జననికి కిరణ్‌తో జరిగిన ఆఖరి సంభాణష గుర్తొచ్చింది. కిరణ్ నీకు ఎవరితోనో పెళ్ళి నిశ్చయమైందని విన్నాను. నిజమా? సూటిగా అడిగింది జనని. ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా వున్నాడు. అది అబద్దం అని చెప్తాడని ఆశపడింది. కానీ 'ఏం నిశ్చయం కాకూడదా?' కొంచెం రెక్లెస్గా ప్రశ్నించాడు.
ఆ సమాధానాన్ని ఊహించని ఆమె నిలువెల్లా వణికిపోయింది. కిరణ్ ... నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నేను లేకపోతే జీవించలేనన్నావు. అలాంటి నువ్వు? కంపిస్తున్న ఆమె స్వరం ఆపై మాట్లాడనీయలేదు. నువ్వు లేకపోతే జీవించలేనన్నాను. ఆ మాట అక్షరాలా నిజం... కానీ ఇప్పుడు నువ్వు శాశ్వతంగా లేకపోయినా హాయిగా జీవించగలను అంటున్నాను. ఇదీ నిజం. తాపీగా చెప్పాడు. అంటే భయంగా అడిగింది.
'చూడు ఇది సిగరెట్' అని నోట్లో పెట్టుకొని అగ్గిపుల్లతో వెలిగించుకొని అగ్గిపుల్లను పారేస్తూ 'చూశావా... అవసరం తీరాక అగ్గిపుల్ల నెలా విసిరేశానో? అంతే ప్రేమించాను. నా అవసరం తీరిపోయింది వద్దంటున్నాను' అని సిగరెట్ పొగ వదలసాగాడు. కిరణ్ నువ్వింత మోసగాడివని కల్లో కూడా ఊహించలేదు అంటూ అరచింది.
నన్నేకాదు. మగజాతినంతా కూడా అసహ్యించుకో అయినా నేనేమీ చెయ్యలేను. సారీ... ఇన్నాళ్ళూ మంచి కంపెనీ ఇచ్చినందుకు థ్యాంక్స్. వీలుంటే వెడ్డింగ్ కార్డ్ పంపుతాను పెళ్ళికి రా. గుడ్‌బై అని వెళ్ళిపోతున్న అతడ్ని ఏమీ చేయలేక వెళ్ళిన వంక చూస్తుండి పోయింది. ఎదురు బండ కాలికి తగలడంతో అమ్మా అంటూ గతంలోంచి వాస్తవంలోకి వచ్చింది. కాలికి తగిలిన ఈ బండ నీ గుండెల్లో తగిలింది... అనుకుంది కసిగా.
మళ్ళీ నడుస్తూ ఏం చేయాలా? ఎలా చేయాలా? అని ఆలోచించసాగింది. ప్రస్తుతం కిరణ్ మగ పెళ్ళివారి విడిదిలో వుంటాడు. అక్కడకు వెళ్ళి ఎవరో అమ్మాయి రమ్మంటుందని చెప్పేస్తే తప్పక వస్తాడు. అప్పుడు కసితీరా ఈ కత్తితో పొడిచిన తర్వాత పోలీసులకు లొంగిపోవాలి. అనుకొని చీరమాటున బొడ్లో పెట్టుకుని ఉన్న కత్తిని ఓసారి తృప్తిగా తడుముకుంది.
నడుస్తున్న ఆమె కంటికి పెళ్ళి ఇల్లు కన్పించింది. దగ్గరకు వెళ్ళి ఓ కిటికీలోంచి లోపలకు చూసింది. అందంగా అలంకరించుకున్న పెళ్ళి కూతురు అమాయకంగా కన్పించింది. ఆ పెళ్ళి కూతురు చుట్టూ వున్న స్నేహితురాళ్ళతో నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటోంది. అంతే జనని ఆలోచనలు రకరకాలుగా మారాయి. ఇప్పుడు కిరణ్‌ను చంపేస్తే? ఈ పెళ్ళి ఆగిపోతుంది. అంతేకాదు, అతడు దుష్టుడు. అందుకే చంపేశారు. అనుకోరు ప్రజలు. ఈ పెళ్ళికూతుర్ని నష్టజాతకురాలంటారు. ఇంకా ఏవేవో నిందలు వేస్తారు. ఇక జీవితంలో ఈ అమాయకురాలికి పెళ్ళి జరగడం కష్టం అనుకొంది. ఆ తర్వాత...
కిరణ్‌ని చంపకపోతే? నా పగ తీరదు. నా పగ కోసం ఆ అమాయకురాలి భవిష్యత్తు నాశనం చెయ్యడం సబబుకాదు . సాటి ఆడదానిగా ఓ ఆడదాని భవిష్యత్తుని నాశనం చెయ్యను, చెయ్యలేను. కిరణ్‌ని చంపకూడదు. అని స్థిరంగా నిశ్చయించుకొని వెనుదిరిగింది. ఆలోచిస్తూ మెల్లగా నడుస్తున్న ఆమె ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల చేత తిట్లు తినడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలు అని నిర్ణయించుకొంది.
నడుస్తున్న ఆమె కంటికి ఓ బావి కన్పించే సరికి అందులో దూకి చనిపోవాలని నిర్ణయించుకొంది. బావి గట్టు మీద నీలబడి దూకబోయే సమయంలో జనని ఆత్మహత్య చేసుకునేంత పిరికి దానివి కావద్దు. జీవితమంటే అన్నీ సుఖాలే వుంటాయా? అసలు నువ్వొక్క విషయం ఆలోచించావా? నిన్ను మోసం చేసినవాడేమో హాయిగా వున్నాడు. నువ్వేమో చావాలంటున్నావ్. సమస్యకు పరిష్కారం ఎప్పుడూ చావు కాదు. కాకూడదు కూడా.
ఇంటికి వెళ్ళు. జరిగింది తల్లిదండ్రులకు చెప్పు. విని ఆదరించారా సరి. లేదా చిన్న ఉద్యోగం చూసుకో. నీ కాళ్ళ మీద నిలబడు. ఆ తర్వాత జీవితంలో గొప్పగా సెటిల్ అయ్యేందుకు ఉద్యోగం చేస్తూనే చదువు. జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత నువ్వు మెచ్చిన, నిన్ను నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్ళి చేసుకో.
దొరకలేదా వదిలెయ్. జీవితానికి పెళ్ళే పరమావధి కాదు. జీవితంలో పెళ్ళి ఓ భాగం మాత్రమే. ఎన్నో మంచి పనులు చేసి సంఘంలో ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఎందరికో ఆదర్శవంతురాలివి కావచ్చు. ఆత్మహత్య చేసుకొని పిరికిదానివి కావద్దు. నీ జీవితాన్ని ధైర్యంగా ముందుకు సాగించు అంటూ ఎంతో ధైర్యం చెప్పింది ఆమె అంతరాత్మ. అంతరాత్మ సలహా అక్షరాలా నిజం... అన్నట్లు ఎక్కడో పాలపిట్ట తియ్యగా కూసింది. అంతే తన నిర్ణయాన్ని మార్చుకొని ఇంటివైపు నడవసాగింది.
అప్పుడే తూర్పు తెల్లవారింది. అందుకు నిదర్శనంగా బాలభాస్కరుడు మెల్లగా పైపైకి వస్తూ భూదేవిని తన వెలుగుతో నింపసాగాడు. ఆ వెలుగు జననికి నూతనోత్తేజాన్నిచ్చింది.