అన్నీ మంచి వస్తువులే... అదొక్కటి తప్ప!

WD
భవిష్యత్తును గురించి ఊహించినది జరగకపోవడమే జీవితం కాబోలు. గత రెండురోజుల నుంచి మనసు పరిపరివిధాలుగా పోతూంది. రెండు రాత్రులు రెండు యుగాలుగా గడిచాయి. ఏంటో.. ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఊహించానా..? ఊహించినది జరగకపోవడమే జీవితమా...? ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి.

ఓరోజు...
ప్లాట్‍‌‌ఫాం మీద అమ్మే ఫ్లవర్‌వాజ్ చాలా అందంగా కన్పించింది. అందమైన వస్తువు కదా అని ముచ్చటపడి కొని ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికెళ్ళాక ప్యాకింగ్ విప్పి చూస్తే ఓ పక్కంతా డామేజ్‌తో వెక్కిరించిందది. ఆ డామేజ్‌ కొనేటప్పుడు గమనించకపోవడం పొరపాటే... ఆ డామేజ్ ప్రభావం నా జీవితం మీద మాత్రం వుండదు. అయినా.. అది చూసి "ఏమ్మా సునీ...! ఈ డామేజ్డ్ ఫ్లవర్ వాజ్ ఏ షాపులో కొన్నావు?" చిరాకుపడిపోతూ ప్రశ్నించారు నాన్న.

"షాపులో కొనలేదు డాడీ...".
"మరి..."
"ఫ్లాట్‌ఫాం మీద కొన్నాను" భయపడుతూ చెప్పాను.
"వ్వాట్ బేబీ..! నీకెన్నిసార్లు చెప్పాను.. అయినా ఇటువంటి పనులు చేస్తూనే ఉన్నావు" అనేసి వెళ్ళిపోయారు నాన్న.
ఫ్లాట్‌ఫ్లారాల మీద, హాకర్స్ దగ్గర కొనడం నాన్నగారికెందుకో నచ్చదు. వాళ్ళ దగ్గర కొన్నప్పుడు బిల్లూగట్రా ఇవ్వరు కనుక కొన్న తర్వాత చిన్న డామేజ్ ఉన్నా ఆ వస్తువు మార్చుకోవడానికి వీలుండదని కాబోలు.

క్వాలిటీ చూసి వస్తువుల్ని కొనడం నాన్నగారికి అలవాటు. రేటు కాస్త ఎక్కువైనా పెద్ద పెద్ద షాపుల్లోనే కొంటుంటారు. క్వాలిటీ విషయంలో ఆయనే మాత్రం కాంప్రమైజ్ అవరు. నా డ్రస్సుల దగ్గర నుంచి అమ్మ చీరల వరకు మాకిష్టమైనవే కొనుక్కున్నా.. అవి కొనడం మాత్రం నాన్న చెప్పిన పెద్ద షాపుల్లోనే..

కొన్న వస్తువుల్లో ఏ చిన్న డామేజ్ కన్పించినా సహించేవారు కాదు. వెంటనే ఆ వస్తువు తీసుకెళ్ళి షాపువాడికి చూపించి, వాడిని చీవాట్లు పెట్టి.. వేరే మంచి వస్తువు తీసుకొచ్చేవారు నాన్న. ఓసారి నాన్నగారు తెచ్చిన క్యాండిల్స్ ప్యాకెట్‌లో ఓ విరిగిపోయిన క్యాండిల్ కన్పించింది. వెంటనే ఆ ప్యాకెట్ తీసుకొని షాపుకెళ్ళతున్న నాన్నగారితో -

"ఎందుకండీ..! దాన్ని తీసుకొని షాపుకెళ్ళడం.. పాకెట్‌లో ఒక్క కాండిల్ మినహా మిగిలినవన్నీ బాగున్నాయి కదా..!" అని అమ్మంటే.. "చూడు.. మన దగ్గర నుంచి క్యాండిల్స్‌కి రేటు తీసుకుని ఒక్కటైనా విరిగింది ఇవ్వడం తప్పు. విరిగింది ఒక్క చిన్న క్యాండిలే కావచ్చు. కానీ నా కెందుకో షాపువాడు ఆ ఒక్క క్యాండిల్ దగ్గర వినియోగదారుడ్ని మోసం చేయడం అన్నది నా దృష్టిలో పెద్ద నేరం. అమ్మేవాడి దృష్టిలో వినియోగదారుడు లోకువ కాదు అని వాడికి తెలియజెప్పడానికే నేనిది తీసుకెళ్ళి వాడికిచ్చి కొత్త ప్యాకెట్ తీసుకొస్తాను." అంటూ వెళ్ళి కొత్త ప్యాకెట్ తెచ్చారు.

నాన్నగారప్పుడప్పుడు అంటుంటాడు. -
"వినిమయదారులెప్పుడూ వినియోదారుల్ని ఏదో విధంగా మోసం చేయాలనే చూస్తుంటారు. వాళ్ళ మోసాల్ని వినియోగదారులు ఎదిరించకపోతే వాళ్ళకు ఎదురు చెప్పేవాళ్ళు వుండరన్న ధీమా వాళ్ళలో పెరిగిపోతుంది. తద్వారా వాళ్ళ మోసాలు పెరిగిపోతాయ్. అందుకనే ఏ వస్తువు కొనేటప్పుడైనా వినియోగదార్లు వాళ్ళ హక్కులేంటో ముందుగా తెలుసుకొని చాలా అప్రమత్తంగా వుండాలి."

చిన్న క్యాండిల్ విరిగిన విషయం షాపువాడు గమనించి వుండడు. దానికే ఏదో పెద్ద మోసం జరిగిపోయిందని, తాను మోసగించబడ్డానని అప్పుడంత గొడవ చేసిన నాన్నగారు.. తనెంతో ఇష్టపడి.. తనశక్తిమించిన రేటు పెట్టి కొన్న వస్తువు.. పనికిరానిదని తెలుసుకుంటే ఏం చేస్తారో?

ఈ విషయంలో తానెంత మోసగింపబడ్డాడో తెలుసుకుంటే.. వినియోగదారుడిగా ఆయన ప్రతిస్పందన ఎలా వుంటుందో..? ఏంటో.. నా ఆలోచనలు - నా ఆలోచనలు నాకే అర్ధంకాకపోయినా.. నాన్నగారు మాత్రం చాలా పట్టుదల వున్న వ్యక్తన్న విషయం నాకు బాగా తెలుసు.

కలర్ టీవీ కొనేటప్పుడు మార్కెట్‌లో బాగా విచారించి.. అన్ని టీవీల కంటే కాస్త ధర ఎక్కువన్పించినా క్వాలిటీ గల టీవీనే కొన్నారు నాన్నగారు. అయినా ఆ టీవీ ఇంటికొచ్చిన రెండోరోజే రిపేరుకొచ్చి కూర్చుంది. వెళ్ళి షాపువాడికి చెప్తే ఇదిగో.. అదుగో.. అంటూ ఓ నెలరోజులు దాటేసేసరికి నాన్నగారికి ఒళ్ళు మండింది.
షాపువాడికి లాయర్ నోటీసు ఇప్పించాడు. అయినా షాపువాడిలో ఏవిధమైన స్పందన లేకపోయేసరికి న్యాయం కోసం వినియోగదారుల ఫోరం కెళ్ళారు నాన్న. పదహైదు రోజులు గడిచేసరికి కొత్త టీవీ తెచ్చి ఇంట్లో పెట్టారు కంపెనీ వాళ్ళు.నాన్నగారిలో అంతటి పట్టుదల వుంది.
నాన్నగారు కొన్న ప్రతి వస్తువూ మంచి క్వాలిటీదే..!

ఇంట్లోని పిన్ను దగ్గర నుంటి ఫ్రిజ్ వరకు ఏ వస్తువు తీసుకున్నా క్వాలిటీలో ఏ మాత్రం లోపం కన్పించదు.
అలాంటి నాన్నగారు నా కోసం కొన్న వస్తువు..
ఇంకొద్దిసేపట్లో నా గదిలోకి రాబోయే ఆ వస్తువు.. చూడ్డానికి మాత్రం ఎంతో అందంగా వున్నా.. క్వాలిటీ శూన్యం..!

నాన్నగారికి నచ్చింది.. మరీమరీ నచ్చింది... అందరూ ఎంతో మెచ్చారు కూడా...అయినా నాకు నచ్చలేదు.
"చూడమ్మా! నీకు నచ్చని వస్తువుతో ఎప్పుడూ సర్దుకోవద్దు... కొంచెం రేటెక్కువైనా సరే నచ్చిన మంచి వస్తువే కొనుక్కో... కొన్న తర్వాత క్వాలిటీ బాగాలేదని తెలిస్తే.. కొనేశాం కదా అని పొరపాట్న కూడా అదే వస్తువు వుంచేసుకోవద్దు.. తిరిగి ఇచ్చేసి అలాంటిదే మంచి క్వాలిటీ వుండేది తెచ్చుకో.." అని పదే పదే చెప్పే నాన్నగారితో నాన్నా.. నువ్వు నా కోసం కొన్న ఆ వస్తువు నాకొద్దు.. మార్చుకుంటానంటే వీలుపడుతుందా...? పోనీ నాకు నచ్చలేదు కనుక ఆ వస్తువు నాకు నచ్చలేదని ఖచ్చితంగా చెప్పేస్తే..?

అంత డబ్బు పోసి కొన్న నాన్నగారేమంటారో...
నాన్నగారేమంటారో తెలియదుగానీ సమాజం మాత్రం నన్ను హర్షించదు.
ఈ సమాజం హర్షించదని నేను సర్దుకుపోవాలా..?
వినియోగదారులెప్పుడూ చాలా అప్రమత్తంగా వుండాలని అందరికీ చెప్పే నాన్నగారు ఇలాంటి 'పనికిరాని' వస్తువునెలా కొన్నారు?

చూడడానికి ఎంతో అందంగా వున్నా అది 'పనికిరాని' వస్తువని నాకు మాత్రమే తెలుసు. నేను భయంకరంగా మోసగించబడ్డాననీ తెలుసు. కానీ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు.

పోనీ ఆ వస్తువు మార్పు కోసం వినియోగదారుల ఫోరం కెళ్తే..!
అసలీతరహా మోసం వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తుందా...?
వినిమయదారుల దగ్గర నుంచి వినియోగదారులు కొన్నప్రతి వస్తువు తాలూకు లావాదేవీలన్నీ వినియోగదారుల ఫోరం పరిధిలోకి రావాలి కదా?

ఆ వస్తువు అమ్మకం కొనిగోలు వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తుందో రాదో గానీ... రెండ్రోజుల క్రితం లక్షలుపోసి కొన్న ఆ 'పనికిరాని' వస్తువు మాత్రం ఇంకొద్దిసేపట్లో నా గదిలోకొచ్చి తీరుతుంది. అన్నట్టు.. ఇంతకీ ఆ వస్తువేంటో చెప్పనేలేదు కదూ...? చూడముచ్చటగొలిపే అందంతో... అతి భయంకరమైన శాడిజాన్ని నరనరాన జీర్ణించుకొని పదుగురి ముందు ఎంతో అమాయకంగా నవ్వుతూ తిరిగే పెద్ద ఆఫీసరుగారైన నా భర్తే ఆ వస్తువు! ఆశ్యర్యంగా వుందా..?

అతడు భర్తగానే కాదు మగాడిగా కూడా 'పనికిరాని' వాడని.. ఐ మీన్ సంసారయోగ్యంకాని వాడని నాకు ఖచ్చితంగా తెలిసినా న్యాయం కోసం ఏ ఫోరం కెళ్ళి చెప్పుకోవాలో తెలియని స్థితి నాది. ఏంటో. నా పరిస్థితికి మీరు జాలిపడకుండా...నాకు జరిగిన ఈ భయంకర మోసాన్ని నేనెవరితో చెప్పుకోవాలో- న్యాయం కోసం ఏ ఫోరంకెళ్ళాలో మీరైనా సలహా ఇవ్వండి... ప్లీజ్...

వెబ్దునియా పై చదవండి