ఆర్టీసీ బస్టాండులో బస్సు దిగిన మాధవి కళ్ళు భర్త కోసం వెతికాయి. అతను ఎక్కడా కన్పించలేదు. నిరాశగా స్టేషన్ బయటకు వచ్చి రిక్షా ఎక్కి భర్త లెటర్లో రాసిన యింటి అడ్రసు చెప్పింది. రిక్షా వెళ్తూ వుంది. దార్లో ఒకచోట చాలామంది ఆడవాళ్ళు గుంపుగా వున్నారు. వారిని వెళ్ళిపొమ్మని పోలీసులు దబాయిస్తూ వున్నారు. స్కూలు రోజుల నుండి యాక్టివ్‌గా లీడర్షిప్ క్వాలిటీస్ కల్గిన మాధవి రిక్షా ఆపి...
"ఏంటి మీరెందుకు గుంపుగా వున్నారు?" అని ప్రశ్నించింది గుంపులోని ఆడవారిని. "వరకట్న హత్యకేసుని ఆత్మహత్యగా మార్చారు పోలీసులు. అది ఆత్మహత్యకాదు వరకట్న హత్య, ఆకేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం," అంటూ ఆవేశంగా చెప్పారిద్దరు ఆడవాళ్ళు. అప్పుడే పోలీసులు మళ్ళీ వచ్చి వాళ్ళను తరమబోయారు.
"ఆగండి. న్యాయంకోసం పోరాడేవారిని అడ్డుకుంటారా...? మేం మీ స్టేషన్‌కొచ్చి మాట్లాడాలి" అంది మాధవి ఆవేశంగా. అందరూ కలిసి పోలీసు స్టేషనుకు వెళ్లారు. అయితే స్టేషన్లో ఎస్.ఐ లేడు. దీనితో హెడ్ కానిస్టేబుల్ ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా...
" మీ తరపున ఎవరైన ఒకరు ఉండండి" అన్నాడు. అరగంటలో అందరి మెప్పును పొందిన మాధవిని ఉండమన్నారు గుంపులోని ఆడవారందరూ. ఎస్.ఐ. ఎమ్.ఎల్.ఏ తో కలసి గెస్ట్‌హౌస్‌లో వున్నాడని తెలిసి ఫోన్ చేశాడు హెడ్‌కానిస్టేబుల్. ఫోన్లో జరిగింది చెప్పాడు.
ఎమ్.ఎల్.ఏతో కలిసి తాగిన ఫారిన్ విస్కీ నిషా నషాళానికి అంటివుంది ఎస్.ఐలో. "వెధవది వాళ్ళ తరపున వచ్చినదాన్ని బొక్కలో తొయ్యండి. నే వచ్చి దాని పని పడతాను". అన్నాడు ఎస్.ఐ కిరణ్ కోపంగా. ఎస్.ఐ సలహా మేరకు మాధవిని లోపల తోశాడు హెడ్ కానిస్టేబుల్. ప్రస్తుతం మాధవి ఒంటరి ఆడది. అందునా పోలీసుసెల్లో వుంది. ఇక పోలీసులకు అడ్డేముంది. అందుకే హెడ్డు మొదలు సెంట్రీ వరకూ బలవంతంగా ఆమెను అనుభవించారు.
సమయం రాత్రి పదిగంటలయ్యింది. విచక్షణ మరచి రాక్షసుడిలా రక్షక భట నిలయంలోకి ప్రవేశించాడు ఎస్.ఐ కిరణ్. "ఎక్కడా వీరనారి?" ప్రశ్నించాడు హెడ్డుని. "సెల్లో వుంది సార్. మా వంతు పూర్తయింది. మిగిలింది మీదే!" అన్నాడు హెడ్డు. సెల్లో ప్రవేశించాడు. దీనంగా తలవంచుకుని మౌనంగా రోదిస్తోందామె.
"ఇప్పుడెందుకేడవడం వీరనారిగా ప్రవర్తించినప్పుడు తెలియదా?" అంటూ ఆమె జుట్టు పట్టుకుని తల పైకెత్తాడు. ఆమె మొహం చూసి షాక్ తిన్నవాడిలా తయారయ్యాడు. నిషా పూర్తిగా దిగింది. ఆమెను భార్యగా గుర్తించాడు ఎస్.ఐ. కిరణ్. "నువ్వు ...నువ్వు ..నువ్వెప్పుడొచ్చావ్?" అన్నాడు తడబడుతూ. "మీ ఖాకీ కామం కీకారణ్యంలో కదలినప్పుడు" అని అసహ్యంగా చూసింది భర్త వైపు.