"డాక్టర్! ఈయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది.. ఎందరో డాక్టర్లకి చూపించాను. కానీ ఏం ప్రయోజనం లేదు.. చివరిసారిగా మీ వద్దకు తీసుకు వచ్చాను" అంటూ భర్త శేఖర్‌ను గూర్చి నగరంలో అతి పెద్ద డాక్టరయిన నాయుడు గారికి చెప్పింది అనిత. శేఖర్‌ను రకరకాలుగా పరీక్ష చేసిన తర్వాత ... "చూడండి శేఖర్ గారూ!" మీరు కనుక సిగరెట్లు మానకపోతే మీరెన్ని మందులు వాడినా మీ ఆరోగ్యం బాగుపడదు. అన్నాడు డాక్టర్. "డాక్టర్ సిగరెట్ మానాలనుకుంటే ఎప్పుడో మానేసివుండవచ్చు. అయినా నేను మానను. నన్ను సిగరెట్ మానమని చెప్పవద్దు. ప్లీజ్" అంటూ వేడుకోసాగాడు శేఖర్. అయిదు నిముషాలు ప్రశాంతంగా వున్న డాక్టర్ అనితను బయటకు వెళ్ళమని చెప్పి, శేఖర్‌ని "మీరెందుకు సిగరెట్ మానకూడదనుకుంటున్నారో చెప్పమని?" అడిగేసరికి... "డాక్టరు నేను ఇంటర్ చదివే రోజుల్లో వాణి నాకు పరిచయమై అది ప్రేమగా మారింది. తప్పక మేం వివాహం చేసుకోవాలనుకున్నాం. వాణి అందరి ఆడవాళ్ళలా కాక నువ్వెందుకు సిగరెట్ తాగవ్? అని ప్రశ్నించేసరికి నేను ఆశ్చర్య పోయాను. ఆమెకు సిగరెట్ పొగ వాసన ఎంతో యిష్టమట. అందుకని నేను ఆమె సమక్షంలో ఆమె ఆనందం కోసం సిగరెట్ కాల్చేవాడిని. మా డిగ్రీ చదువు కూడా పూర్తయ్యింది. కానీ మా ప్రేమ మాత్రం దినదినాభివృద్ది చెందసాగింది. ఓ రోజు వాణి దగ్గర నుండి ఒక లెటరు వచ్చింది. మా నాన్న పెళ్ళికి అంగీకరించలేదు. అందుకని నేను ఆయనను బాధపెట్టకూడదని చనిపోతున్నానని రాసింది. లెటర్‌తో పాటు ఆరోజే వాణి వాళ్ళ ఊరినుండి నా మిత్రుడు రాకేష్ వచ్చి వాణి చనిపోయిందని రెండు రోజుల క్రితమే అంత్యక్రియలు కూడా జరిపేశారని చెప్పాడు. చివరి చూపు కూడా నోచుకోలేకపోయానని ఎంతో బాధపడ్డాను. ఇంట్లో మా తల్లిదండ్రులు బలవంతంగా అనితతో వివాహం జరిపించారు. అయినా ఎందుకో వాణిని మరిచిపోలేకపోతున్నాను. అందుకే ..అందుకే డాక్టర్ ఎప్పుడూ సిగరెట్లు కాలుస్తుంటాను. అలా సిగరెట్ కాలుస్తున్నప్పుడల్లా వాణి నా ఎదురుగా వచ్చి పొగ వాసన చూస్తున్నట్లు అన్పిస్తుంది. ఇప్పుడు చెప్పండి డాక్టర్. సిగరెట్ మానయమంటారేమో! నేను సిగరెట్లు ఎక్కువ త్రాగితే చనిపోతానని తెలుసు అయినా మానను." స్థిరంగా చెప్పాడు శేఖర్. శేఖర్ మాటలు విన్న డాక్టర్‌కి గుండెలో ఎవరో కెలికినట్లయింది. ఎందుకంటే ఆ రోజు వాణి శేఖర్‌ను ప్రేమించానంటే "ప్రేమా దోమా ఏమీ లేదు నువ్వు నేను తెచ్చిన సంబంధం చేసుకోవాలని" ఏకైక కూతురు వాణితో అన్నాడు డాక్టర్ నాయుడు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కానీ శేఖర్ ఆమెని యింతగా యిప్పటికీ ప్రేమిస్తున్నాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు డాక్టర్. అందుకే అతనికి సిగరెట్లు మానాలా? వద్దా? అని చెప్పలేక సతమతమవుతున్నాడు.