నేనూ.. నా రాక్షసి... మా సంక్రాంతి ముగ్గు

Venkateswara Rao. I

శుక్రవారం, 14 జనవరి 2011 (19:11 IST)
WD
"కొక్కొరొక్కో... కొక్కొరొక్కో..." అంటూ సెల్ ఫోనులో నుంచి వస్తున్న కోడిపుంజు రింగ్ టోన్ విశ్వేశ్వర్రావు బుర్రను ఫిడేల్ వాయిస్తోంది. ఎంతకీ ఆ కూత ఆగకపోవడంతో తనే లేచి సెల్ గొంతు నొక్కి... "ఏమేయ్ ఆండాళ్లు... సంక్రాంతి నెల పట్టిన దగ్గర్నుంచి చూస్తున్నా. సెల్‌లో కొక్కొరొక్కో అంటూ అలారమ్ పెడతావ్. కానీ నువ్వు మాత్రం లెగవ్" అని కసిరాడు విశ్వేశ్వర్రావు.

నిద్రలోనే... "నేను లెగవనని నాకు తెలుసు. మీరు ఎలాగూ లేస్తారు. నన్ను లేపుతారని నాకు తెలుసు" అంటూ మళ్లీ ముసుగు తన్నింది. విసు(విశ్వేశ్వర్రావు)కు చిర్రెత్తింది. "రేపట్నించి కొక్కొరొక్కో ట్యూన్ సెట్ చేస్తే ఊరుకోను.. చెప్తున్నా" అంటూ మళ్లీ పడుకోవడానికి ఉపక్రమించాడు. అండాళ్లు నిద్ర కళ్లతోనే... "ఈ ట్యూన్ పెట్టకుండా మొన్నామధ్య కీబోర్డు మ్యూజిక్ పెడితే హ్యాపీగా నిద్ర లాగించేశారు. మీ మొద్దు నిద్ర వల్ల నేను నిద్ర లేవలేకపోయాను" అంటూ కళ్లు నులుముకుంటూ బయటకు నడిచి వెళ్లింది.

విసు టైం చూసుకున్నాడు. ఉదయం ఐదుగంటలయింది. మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు. అలా నిద్రలోకి జారుకున్నాడో లేదో... "ఏమండోయ్..." అంటూ ఆండాళ్లు గావుకేక పెట్టింది. దీంతో విసు ఉలిక్కిపడి లేచి... "ఏంటే.. మళ్లీ ఏమొచ్చి పడింది" అన్నాడు. "మరేం లేదు. నేను ముగ్గు వేయడం మొదలెట్టాను. చాలా పెద్ద ముగ్గు. ఉదయం లోపు అది పూర్తయ్యేలా కనిపించట్లేదు. కాస్త రంగులు వేద్దురూ.." అంది

లేవబోయిన విసుకు కాళ్లు సహకరించడం లేదు. కాళ్లు పట్టుకుపోయినట్లు అనిపించింది. అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. ఏమైంది నాకు. కాళ్లెందుకు నొప్పెడుతున్నాయి... అంటూ బాగా ఆలోచించాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఆ ముందటి రోజు తన ఆఫీసులో ముగ్గుల పందెంలో పాల్గొని పడీపడీ ప్రైజు కొట్టుకుందామని మోకాళ్లతండ వేసి మరీ ముగ్గుకు రంగులు వేశాడు. అదీ ఎఫెక్ట్.. ఇలా ఆలోచిస్తుండగా...

"ఏవండీ... ఏంటా నత్తనడక. బయటకు రండి" అంటూ మళ్లీ గద్దించింది అండాళ్లు. అడుగులు లెక్కేసుకుంటున్నట్లుగా చీమలా బయటకెళ్లాడు విసు. "ఏమేవ్... నిన్న మా ఆఫీసులో నేను ముగ్గుల పందెంలో పాల్గొన్నాను కదా. కాళ్లు బాగా నొప్పెడుతున్నాయి. చెప్పొద్దూ.. కాళ్లు నిటారుగా తప్ప వంగటం లేదు. నన్నొదిలెయ్" అన్నాడు.

"అబ్బ.. ఏం నాటకాలాడుతారు. కాళ్లు పట్టుకుపోయాయా...? ఆఫీసుకోసమైతే రంగులు, పువ్వులు, పేడలు పట్టుకెళ్తారూ... నాకు సాయం చేయమంటే మాత్రం కాళ్లు నొప్పెడతున్నాయంటూ తప్పించుకుంటారూ.." అంటూ నిష్టూరాలాడింది ఆండాళ్లు. "ఒసేవ్ ఆండాళ్లూ.. నే చెప్పేది నిజంగా నిజం. కావాలంటే మా ఆఫీసులో అడిగి చూడు" అన్నాడు. దాంతో విసును వదిలిపెట్టింది ఆండాళ్లు.

విసు ఎలాగో మెల్లగా ఆఫీసుకు బయలుదేరి వెళ్లాడు. చిత్రం తనే అనుకుంటే... నిన్న ముగ్గుల పోటీలో పాల్గొన్నవారంతా కొంతమంది గోరింకల్లా గెంతుతుంటే మరికొందరు నత్తల్లా మెల్లగా తనలాగే నడుస్తున్నారు. మరికొందరైతే "రోబో" మాదిరిగా బిగుసుకుపోయి నడుస్తున్నారు.

తన సీట్లో ఆశీనుడవుతా... తన కొలీగ్‌తో... "ఏం ముగ్గుల పోటీ అండీ బాబూ... కాలు తీసి కాలు వెయ్యలేకపోతున్నా. రెండు కాళ్లు ముందుకు వెనుకకు వంగటం లేదు. నిటారుగా బద్దలు కట్టినట్లు బిగుసుకుపోయాయంటే నమ్మండి" అన్నాడు. కొలీగ్ అందుకుని.. "ఏం లేదు. అలా బీచ్ ఒడ్డుకెళ్లి ఒక్క బిగువున ఆపకుండా పరుగు లంఘించండి. ఒక్క దెబ్బకు కాళ్ల నొప్పులు వదిలిపోతాయ్" అన్నాడు.

విసు తడుముకోకుండా... "అంటే పొద్దున్న మీరలా పరుగెత్తి గనుక వచ్చారా..? చూస్తుంటే మీకు కాళ్లు నొప్పెడుతున్నట్లు అనిపించట్లేదు" అన్నాడు విసు. "భలేవారే... నేనాపని చేయాల్సిన అవసరమే లేదు. రోజూ పొద్దున్నే లేచి 50 గుంజీళ్లు తీసి కాని మిగిలిన పని మొదలెట్టను. ఆ గుంజీళ్ల ముందు ఈ ముగ్గు వ్యవహారం నాకు దిగదుడుపే" అన్నాడు కొలీగ్.

"నిజమే మేస్టారూ... బొత్తిగా వ్యాయామం చేయట్లేదు. మా ఆండాళ్లు అప్పటికీ చెపుతూనే ఉంటుంది. రోజూ కనీసం అరగంటైనా ఎక్సర్‌సైజు చేయండి అని అంటుంది. కానీ టైమేదీ.." అంటూ దీర్ఘం తీశాడు. ఇంతలో విసు ముగ్గుల పోటీలో సారథ్యం వహించిన మరో కొలీగ్‌కు ఫోన్... దాని సారాంశం ఏంటంటే... " నేను ఆఫీసు బిల్డింగ్ ఓనర్‌ను మాట్లాడుతున్నా... ముగ్గుల పోటీలో మీరేసిన ముగ్గు చాలా బావుంది. వీలుంటే మా ఇంటి ముందు వేద్దురూ.." అన్నది.

"అయ్యబాబోయ్.. మళ్లీ సంక్రాంతి ముగ్గా.." అంటూ గావుకేక పెట్టాడు విశ్వేశ్వర్రావు.

వెబ్దునియా పై చదవండి