లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి పెద్ద ఎత్తున మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ చెన్నైసమాచార కేంద్రం సలహా సంఘం అధ్యక్షుడు కె. ఆనంద కుమార్ రెడ్డి తెలిపారు. దాదాపు 150 మంది వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెన్నై వాసుల కోరిక మేరకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా తిరుమలలో టీటీడీ యాగాలు చేస్తుందన్నారు. మొదటి సారిగా హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది జూలైలో ఈ యాగం జరిగిందన్నారు.
ఆ తరువాత ప్రస్తుతం అక్టోబరు 12,13,14 తేదీలలో చెన్నైలోని తిరువాన్‌మియూర్‌లో చేపడుతున్నట్లు ప్రకటించారు. యాగం 8 ఎకరాల స్థలం జరుగుతుందన్నారు. గతంలో సాయిబాబా అక్కడే యాగం చేశారన్నారు. అది అందరికీ తెలిసిన ప్రదేశం కావడంతో అక్కడే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి తిరుమలలోని వేదవిశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు శ్రీనివాసాచార్యులు సారథ్యం వహిస్తారన్నారు.
రోజులో ఉదయం, సాయంత్రం రెండుసార్లుగా జరిగే యాగానికి భారీ ఎత్తు భక్తులు తరలివస్తున్నట్లు వివరించారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి సెషన్‌లో కనీసం 50 వేల మంది హాజరవుతారని ఆయన అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇక్కట్లు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. టీటీడీ డిప్యూటీ ఈఓ ఎం.గోపాలకృష్ణ మాట్లాడుతూ, దేవస్థానం తరపున భక్తులకు ఉచితంగా మూడు చిన్న లడ్డూ (ప్రసాదం లడ్డూ)లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.