తిరుమలలో వేంకటేశ్వరునితో పాటు ఇతర దేవతలున్నారా..?!!

మంగళవారం, 4 అక్టోబరు 2011 (14:10 IST)
WD
తిరుమల వెంకన్న ఆలయంలో ఉన్నది వేంకటేశ్వరుడు ఒక్కడేనా...? ఇంకా ఎవరైనా దేవతలు కొలువై ఉన్నారా? ఉంటే వారికి పూజలు ఎలా అందుతున్నాయి...? ఏంటి ఇలాంటి సందేహాలు లేవనెత్తుతున్నారు..? తిరుమలలో ఉన్నది వేంటేశ్వరుడు ఒక్కడే కదా..! అనే కదా అందరూ అనుకునేది. కానీ తిరుమల ఆలయంలో చాలా ఉపదేవాలయాలున్నాయి. అవేంటో తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ కథనాన్ని చదవాల్సిందే.

తిరుమల ఆలయంలో అడుగుపెట్టగానే వినిపించేది గోవింద నామస్మరణలే అయినా చాలామంది దేవుళ్ళు అక్కడే కొలువై వున్నారు. కలియుగనాథుడు వేంకటేశ్వరుడి ఆలయం పరివార దేవతలకు నిలయంగా ఉంటోంది. ఇందులో ఉన్న అందరు దేవతామూర్తులు వెంకన్నతోపాటు పూజలందుకుంటున్నారు. దేవదేవుని పరివారంగా గుర్తింపు పొందిన వీరిలో ఒక్కొక్క దేవుడికి ఒక్కో చరిత్ర ఉంది.

WD
పరివార దేవతలు వేంకటేశ్వరుని చరిత్ర సంబంధం ఉన్నవారే కావడం విశేషం. పరివార దేవతలకు లోపలే ఆలయాలు కట్టించడంలో ఎందరో రాజులు, ఆల్వార్లు, రామానుజాచార్యలాంటి వారు విశేష కృషి చేశారు. ఆగమశాస్త్ర అనుసారం ఈ దేవతలు అన్నిరకాల పూజలు అందుకుంటున్నారు. వారిలో మొదటి దేవుడు వరదరాజస్వామి.

తిరుమలలో వెంకన్న ఉండడానికి కాస్తం చోటు ఇచ్చిన స్థలదాత వరదరాజ స్వామి. ఆ తరువాత వెంకన్నే సకల జగత్తును తన వశం చేసుకున్నాడు. చోటిచ్చేందుకు వీరిద్దరి మధ్య ఓ ఒప్పందం కూడా ఉందట. దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడు ముందుగా వరదరాజస్వామి దర్శనం చేసున్న తరువాతే తన దర్శనానికి వస్తారని వెంకన్న మాట కూడా ఇచ్చాడు.

ఇందుకు అనుగుణంగానే నిన్నమొన్నటి దాకా పుష్కరిణికి పక్కనున్న వరదరాజ స్వామి దర్శనం తరువాతే క్యూ వెంకన్న గుడిలోకి వెళ్లేది. ప్రస్తుతం ఆ ఆనవాయితీ కాలగర్భంలో కలసి పోయింది. తెలిసిన వారు మినహా మిగిలిన వారందరూ నేరుగా వెంకన్న దర్శనానికే వెళుతున్నారు. లోపలి భాగంలో కూడా వరద రాజస్వామి ఆలయం ఉంది. అక్కడ వరద రాజస్వామి కూడా పూజలు అందుకుంటున్నారు.

WD

అనంత జగతికి అధిపతి అయిన వేంకటేశ్వరుడి సేనాపతి విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడి వాహనం కదలకపోతే తిరుమల బ్రహ్మోత్సవాలు అడుగు కూడా ముందకు సాగవు. బ్రహ్మోత్సవాలలో విశ్వక్సేనుడు అన్నీ తానే అయి కార్యక్రమాలను నడిపిస్తుంటాడు. అంతే కాదండోయ్‌... గుడిలో స్వామివారికి జరిగే నిత్య పూజలు, వేడుకలకు ఎటుంటి దోషాలు కలుగకుండా రక్షణగా ఉంటాడు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయంలో కూడా ఆయనకు మంచిచోటే లభించింది.

ప్రధాన ఆలయానికి పక్కన ముక్కోటి ప్రదక్షిణలో కొలువుదీరి ఉంటాడు. వైష్ణవ వేడుకలు, ఆలయ పూజలలో ఆయనే మొదటి ప్రార్థనలు అందుకుంటాడు. ఈయనకున్న నాలుగు చేతులలో పై రెండు చేతులు శంఖు చక్రాలను ధరించి ఉంటాయి. కింది కుడి చేయి అవజ్ఞ హస్తమని, కింది ఎడమ చేయిని గద హస్తమని అంటారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణ తరువాత విశ్వక్సేన ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో విశ్వక్సేనుడి విగ్రహాన్ని ఊరేగిస్తారు. విశ్వక్సేనుడికి అంతటి ప్రాధాన్యత ఉంది మరి.

WD

వెంకన్నకు అత్యంత నమ్మకమైన భక్తడు ఎవరంటే... ఆయన గరుడల్వార్‌. ఆయనకు గరుడ అంటే అంతటి ఇష్టం. అందుకే బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత మరే వాహనానికి ఉండదు. బ్రహ్మోత్సవాలలో ఎగుర వేసే జెండాపై గరుడ చిత్రం ఉంటుంది. అలాంటి గరుడాల్వార్‌ విగ్రహం వేంకటేశ్వర ఆలయానికి ఎదురుగానే ప్రతిష్టించి ఉంటారు.

వేంకటేశ్వర స్వామిని తీసుకెళ్ళడానికి గరుడ ఎప్పుడూ చేతుల చాచి ఎగురడానికి రెక్కలు సిద్ధం చేసే ఉంటాడు. గరుడ విగ్రహాలు ఆలయంలోనే మండపాలు, ప్రాకారాలపై కూడా చెక్కి ఉంటాయి. ఆలయంలో గరుడకు పెట్టే నైవేద్య కార్యక్రమంలో పాల్గొంటే మహిళలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని వెంకన్న భక్తుల ప్రగాఢ నమ్మకం.

FILE

ఈ ఆలయాలన్నింటితోపాటు యోగ నరసింహస్వామికి కూడా తిరుమల ఆలయంలో స్థానం దక్కింది. మొదటి ప్రాకారంలో ఈశాన్య భాగంలో ఉన్న మండపంలో యోగ నరసింహ మూర్తిని ప్రతిష్టించారు. యోగముద్రలో ధ్యానం చేస్తున్న నరసింహ స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు. ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజలతోపాటు, ప్రతీ శనివారం నరసింహస్వామికి తిరుమంజనం చేస్తారు.

నరసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకుంటారు. స్వామి వారికి ద్వారపాలకుల రూపంలో జయవిజయలు పూజలందుకుంటున్నారు. వీరితోపాటు వకుళ మాతాదేవి, వైష్ణావాచార్యుడు రామానుజాచార్యులవారి విగ్రహాన్ని కూడా ఆలయంలో ప్రతిష్టించారు. ఇలా తిరుమల ఆలయంలో పరివార దేవతలందరూ పూజలు అందుకుంటూనే ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి