తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. రథంపై ద్వార పాలకులు, గంధర్వులు, దేవతామూర్తుల కొలువై ఉండగా శ్రీవారు రథంపై భక్తులకు కనువిందు చేశారు.
వివిధ పుష్పాలు, పూలమాలలతో రథానికి విశేషాలంకరణలు చేశారు. రథోత్సవానికి వేలసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రథోత్సవ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆలయ నాలుగు మాడ వీధులలో రథం తిరిగేందుకు అడ్డుగా ఉన్న ఆర్చిలను బుధవారంనాడే తొలగించారు.
WD
అంతకుముందు ఏడవ రోజైన బుధవారం... భక్తజన బాంధవుడు శ్రీవేంకటేశ్వరస్వామి వారు సూర్య, చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సూర్య భగవానుడికి స్వామివారే ప్రతిరూపం అన్నట్లుగా ఉదయం సూర్యప్రభపై దేదీప్యమానంగా వెలుగుతూ భక్తజనకోటికి కనువిందుచేశారు. రాత్రి చంద్రుడి చల్లటి గాలుల నడుమ వెన్నముద్ద చేతపట్టి చిన్ని కృష్ణుడి రూపంలో చంద్రప్రభ వాహనంపై విహరించారు.