హనుమంతునిపై మలయప్ప స్వామి విహారం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజైన సోమవారం హనుమంత వాహన సేవ ఘనంగా జరుగుతోంది. సర్వాలంకరణా భూషితుడైన శ్రీవారు తన భక్తుడైన హనుమంతుని వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. లక్షలాది భక్తకోటి గోవింద నామ స్మరణతో తిరుమల కొండ మారు మ్రోగుతోంది.

నేడు (సోమవారం) సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలు జరుగనున్న నేపథ్యంలో...తిరుమలేశుని దివ్యానుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి అత్యంత ప్రధానమైన శ్రీవారి గరుడసేవ అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం కలియుగదైవం శ్రీనివాసుడు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

మోహినిని బంగారపు చీర, సూర్య - చంద్ర హారాలు, రత్న కిరీటాలు, కర్ణ పత్రాలు వీటితో పాటు వజ్రపు ముక్కుపుడకతో అలంకరించి, శ్రీకృష్ణుడితోపాటు మోహినిని కూడ పల్లకీలో ఊరేంచిన వైనం భక్తులను కనువిందు చేసింది.

వెబ్దునియా పై చదవండి