స్వామివారి రూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగరం మథించి, అమృతం దక్కగా మాకు మా కని మథనపడేవేళ దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి అతిలోకమోహనమైన కన్యరూపం ధరించి దేవతలకు అమృతప్రదానం చేసిన జగన్మోహరూపమే మోహినీ అవతారం.
అలా శ్రీవారు మోహిని అవతారంలో భక్తులను కనువిందు చేశారు. ఈ వాహన సేవలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి మామూలుగా నిలబడే భంగిమంలో కాకుండా ఆసీనులై ఉంటారు. స్త్రీల ఆభరణాలతో స్వామిని అలంకరిస్తారు. పట్టుచీర, కిరీటంపైన రత్న ఖచితమైన సూర్యచంద్రసావేరి, నాసికకు వజ్రఖచితమైన ముక్కుపుడక, బులాకి, శంఖచక్రాల స్థానంలో రెండు వికసించిన స్వర్ణకమలాలను అలంకరిస్తారు. శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ అలంకరించుకున్న పూలమాలను, చిలుకలు ఈ అవతారంలో స్వామికి అలంకరించడం మరో ప్రత్యేకత.