గరుడోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. మూలవిరాట్‌కు అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ సహస్రనామమాల విశిష్ట ఆభరణాలతో శ్రీమలయప్పస్వామికి అలంకరించారు. ఈ ఆభరణాలలో మలయప్ప స్వామి దేదీప్యమానం వెలిగిపోయారు. బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకే విశిష్టత ఉంది.
గోదాదేవి అలంకరించిన పూలమాలలను తీసుకువచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవలో స్వామివారికి అలంకరించి వూరేగించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సమర్పించిన నూతన పట్టు వస్త్రాలను గరుడసేవ రోజున స్వామివారికి అలంకరించారు. చెన్నయ్ నుంచి వచ్చిన కొత్త గొడుగుల నడుమ వేంకటేశ్వర స్వామి ఊరేగారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఈ ఉత్సవం కొనసాగింది. దాదాపుగా 3 లక్షల మంది ఈ ఉత్సవాన్ని తిలకించారు.