కలియుగ దైవంగా కోట్లాది మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటూ, సప్తగిరుల్లో కొలువైవున్న తిరుమల శ్రీనివాసుని నిలయానికి ఆనంద నిలయమనే పేరుంది. ఈ ఆనంద నిలయం బంగారు వర్ణంలో కళ్లు మిరుమిట్లు గొలుపేలా కనిపిస్తూ.. సాక్షాత్తూ స్వామివారినే దర్శించినంత అనుభూతిని కలిగిస్తుంది. దీన్నే విమాన గోపురంగా అని కూడా పిలుస్తారు.
ఈ ఆనంద నిలయానికి ఇప్పటి వరకు ఏడుసార్లు బంగారు తాపడం వేసినట్టు చరిత్ర చెపుతోంది. ఇందులో తొలిసారి విజయనగరరాజు నరసింగదేవరాయలు ఆనంద నిలయానికి బంగారు రేకులు తొడిగించారు.
రెండోసారి సాళువ మాంగి దేవమహారాజు, తర్వాత మల్లన మంత్రి తాపడం చేయించగా, నాలుగోసారి శ్రీకృష్ణదేవరాయలు బంగారు పూత పూయించారు. ఐదోసారి కాంచీపురానికి చెందిన తాతాచార్య, ఆరోసారి హథీరాంజీ మహంతు ప్రయాగ్‌దాస్ నేతృత్వంలో ఈ బంగారు తాపడాలు జరిగాయి.
చివరగా 1958లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా (ఈవో)గా పని చేసిన చెలికాని అన్నారావు 12 వేల తులాల బంగారంతో పూత వేయించారు. దీంతో ఏడుసార్లు ఆనంద నిలయానికి బంగారు తాపడం వేయించినట్టైయింది.