కన్నుల పండువగా సాగిన శ్రీవారి గరుడసేవ

మంగళవారం, 4 అక్టోబరు 2011 (10:45 IST)
WD
WD
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి అయిన సోమవారం రాత్రి శ్రీ వేంకటేశ్వరస్వామి గరుడసేవ వాహనంపై ఊరేగి అశేష భక్తజన వాహినికి కనువిందు చేశారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు నిర్వహించే ఈ సేవకు పురాణాలతో పాటు భక్తుల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయం తెల్సిందే. ఈ సేవను తిలకించేందుకు లక్షలాదిమంది తిరుమాడ వీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో నిండిపోయారు.

ఈ వాహన సేవలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఆలయ రంగనాయకుల మంటపంలో మలయప్పస్వామికి పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలతో విశేష సమర్పణ కావించారు. అనంతరం కొలువు మంటపానికి ఊరేగింపుగా తీసుకొచ్చి ఊంజల్‌సేవ నిర్వహించారు. తదుపరి ఉత్సవర్లను వాహనమంటపంలో వేంచేపు చేశారు.

ఆ తర్వాత మలయప్ప స్వామిని గరుడవాహనంపై అధిష్టింపజేసి మూలవర్ల ఆభరణాలను అలంకరించారు. ఈ అలంకరణ పూర్తయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన స్వామివారి గరుడ వాహనసేవ తిరుమాడవీధుల్లో సుమారు ఐదు గంటలకుపైగా సాగింది. శ్రీవారి బ్రహ్మరథం ముందుకు సాగుతుండగా వెనుక గోవులు, గుర్రాలు, ఏనుగులు అనుసరించాయి.

శ్రీవారి భక్తుల పండరి భజనలు, కోలాటాలు, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో సప్తగిరులు మర్మోగిపోయాయి. ఈ వాహనసేవలో తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, జేఈవో శ్రీనివాసరాజు, అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి