శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన మంగళవారం వెంకన్నకు వైభవంగా స్నపన తిరుమంజనం జరిగింది. స్వామితో పాటు అమ్మవార్లను వేదికపై ఆసీనులను గావించి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వివిధ సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం జరిపించారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవీ, భూదేవి సమేత మలయప్ప స్వామికి జరిగిన ఈ స్నపన తిరుమంజనం భక్తులకు కనువిందు చేసింది. ఈ స్నపన తిరుమంజనానికి అనంతరం శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని దివ్యపురుషుణిగా అలంకరించి ఊంజల్పై ఆసీనులు చేస్తారు. తదనంతరం అమ్మవార్లతో శ్రీవారికి వైభవోపేతంగా జరిగే ఊంజల్ సేవను తిలకించేందుకు వేలకొలది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.
ఇదిలా ఉండగా, వెంకన్న బ్రహ్మోత్సవాల్లో నేడు (మంగళవారం) రాత్రి 9 గంటల నుంచి 11 గంటల ప్రాంతంలో చంద్రప్రభ వాహన సేవ జరుగనుంది. శ్రీవారిని వజ్రకవచం, రత్నకిరీటంతో అలంకరించి చంద్రప్రభవాహనంపై ఆసీనులు గావిస్తారు. అనంతరం మలయప్ప స్వామిని శ్రీదేవి, భూదేవీ సమేతంగా తిరుమాడవీధుల్లో ఊరేగిస్తారు.
ఇకపోతే మంగళవారం ఉదయం... సూర్యప్రభ వాహనసేవ ఘనంగా జరిగింది. సూర్య ప్రభ వాహనంలో శ్రీవేంకటేశ్వర స్వామి విహరించిన తీరును తిలకించిన భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు.