వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైను గురువారం శ్రీవారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. నేడు (గురువారం) ఉదయం 5.45 నుంచి ఎనిమిది గంటల మధ్య శ్రీవారి చక్రస్నాన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చక్రస్నానం రోజున పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించిన వారికి అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్త జనుల విశ్వాసం.

ముందుగా శ్రీవారు ఉత్సవ మూర్తులై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా పుష్కరిణి చెంతనే ఉన్న వరాహస్వామి మంటపం వద్దకు ఊరేగుతూ రాగా, అక్కడ స్వామి వారికి సాంప్రదాయబద్దంగా ఆహ్వానం పలికారు. స్వామి వారి గాలి సోకితేనే సర్వ పాపాలు తొలిగిపోతాయనే విశ్వాసంలో లక్షలాది మంది భక్తులు మలయప్పను దర్శించుకుని భక్తి పారవశ్యంలో తేలియాడారు.

చక్రస్నానాన్ని పురస్కరించుకుని వరాహ స్వామి ఆలయ మండపం వద్ద వివిధ సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. పుష్కరిణికి ఇరువైపులా పుష్పాలతో రూపొందించిన స్వామివారి భారీ కటౌట్లు, పుష్పాలతో పుష్కరిణిని సుందరంగా అలంకరించారు.

చక్రత్తాళ్వార్‌ రూపంలో స్వామివారికి చక్రస్నానం చేయించి... వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు వైభవంగా జరిపించారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయించారు.

ఇదిలా ఉండగా, శ్రీవారి బ్రహ్మోత్సవాలను పూర్తి చేసే దిశగా గురువారం సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం (దించడం) చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లవుతుందని పండితుల వ్యాఖ్య. అంతేకాకుండా ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు మంగళపూర్వకంగా పరిసమాప్తి పలికినట్లు ఐతిహ్యం.

వెబ్దునియా పై చదవండి