సహజనటిగా పేరుపొందిన జయసుధ అసలు పేరు సుజాత. డిసెంబర్ 17, 1959వ సంవత్సరంలో పుట్టిన జయసుధ 1972లో సంవత్సరంలో విడుదలైన "పండంటి కాపురం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.
12 ఏళ్ల వయస్సులో పండంటి కాపురం చిత్రంలో నటించిన జయసుధ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ చిత్రాలతో పాటు హిందీలోనూ మూడు చిత్రాల్లో నటించింది. "లక్ష్మణరేఖ" అనే చిత్రం ద్వారా జయసుధకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది. మద్రాసులో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి జయసుధ.. హీరోయిన్, అమ్మ, అక్క, ఆంటీ వంటి విభిన్న పాత్రలు పోషించింది.
దక్షిణాదిలో తిరుగులేని తారగా నిలిచిన జయసుధ.. అలనాటి నటి విజయనిర్మల మేన కోడలు. 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్రకు సోదరుడు నితిన్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. జయసుధ-నితిన్ కపూర్ దంపతులకు ఇద్దరు కొడుకులు. 1986లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990లో శ్రేయంత్‌లు జన్మించారు.
తెలుగులో అలనాటి అగ్రహీరోలు ఎన్టీఆర్, అక్కినేని, మురళీ, శోభన్ బాబు, చిరంజీవిల సరసన 230 చిత్రాలకు పైగా నటించిన జయసుధ తమిళంలో బాలచందర్ ద్వారా పరిచయం అయ్యింది. నటిగానే గాకుండా జయసుధ నాలుగు చిత్రాలు నిర్మించింది. సొంతబేనర్‌లో నిర్మించిన "కలికాలం" సెన్సేషనల్ హిట్ అయ్యింది.
అలాగే జయసుధ ఒకే ఏడాది 24 చిత్రాల్లో నటించిన ఘనతకెక్కింది. ఇంకా ఆరునందులు అందుకున్న ఏకైక నటిగా పేరుపొందిన జయసుధ, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇక ప్రముఖ నటి జయప్రద.. జయసుధ బెస్ట్ ఫ్రెండ్.
ఇలా నటీమణిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జయసుధ 2001లో జయసుధ బాప్టిజం పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనది. ఇటీవల వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును ప్రారంభించింది. అలాగే 2009లో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏగా గెలిచారు.