ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్ర ప్రజలను కలచివేసిన సంగతి తెలిసిందే. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. కన్నబిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా తక్కువ కులానికి చెందిన వ్యక్తి బిడ్డను కడుపున మోస్తుందనే కోపంతో.. అమృత తండ్రి హత్య చేయించాడని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రణయ్‌కి న్యాయం చేయాలంటూ ఆయన భార్య అమృత ఉద్యమం చేపట్టారు. జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరిట ప్రత్యేకంగా ఓ పేజీని క్రియేట్ చేసింది. ఆ పేజీని అందరూ లైక్ చేసి, తమకు న్యాయం చేయాలంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా కోరుతోంది. ఆమె కోరుకున్నట్లుగానే.. ఆమె ఉద్యమానికి అనేకమంది మద్దతిస్తున్నారు. ఆ పేజీని లైక్ చేసి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. మరోవైపు ప్రణయ్ భార్య అమృతను, ఆయన కుటుంబసభ్యులను రాజకీయ నాయకులు, ప్రముఖులు పరామర్శిస్తున్నారు. వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
తన తండ్రి తరఫున వేముల వీరేశం తనకూ తన భర్త ప్రణయ్‌కూ ఫోన్ చేసి బెదిరించాడని ఆమె ఆరోపించారు. నల్లగొండలో రాజకీయ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కూడా వేముల వీరేశం పేరు వినిపించిన విషయం తెలిసిందే. తనను కలవాలని వేముల వీరేశం చెప్పాడని, అయితే భయంతో తాము వెళ్లలేదని అమృత చెప్పారు.