డాడీ కనిపిస్తే నేనే చంపేస్తా.. మారుతీ రావు జైలులోనే వుండిపో.. లేకుంటే..?
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (15:36 IST)
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు దిగ్భ్రాంతికర వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నారు. కన్నకూతురు అని చూడకుండా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, అల్లుడిని పాశవికంగా మారుతీ రావు హత్య చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విషయంలో పోలీసులు మీడియా ముందుకు రాలేదు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ భార్య అమృత డిమాండ్ చేస్తుంది.
క్యాస్టిజం మీద పోరాటం సాగిస్తానని, అందరూ తనకు మద్దతునివ్వాలని అమృత కోరుతోంది. మా డాడీ కనిపిస్తే తానే చంపేస్తానని చెప్తోంది. తన కడుపున వున్న బిడ్డ కోసం బతుకుతున్నానని.. లేకుంటే ఈ పాటికి ప్రణయ్‌తో కలిసి వెళ్లుండేదానినని అమృత వాపోతోంది. పోలీసులు మొదటి నుంచి తమకు సపోర్టు చేశారని, 10, 11 రోజుల్లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆమె చెప్పింది.
ఇదే తరహాలో ప్రణయ్ సోదరుడు అజయ్ కూడా మారుతీ రావుకు మీడియా ముఖంగా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మారుతీ రావు జైలు నుంచి బయటికి రావొద్దు. వస్తే కనుక ప్రజలే నిన్ను చంపేస్తారు. మా ఫ్యామిలీ నిన్నేమీ చేయకపోయినా.. ప్రజలే నిన్ను చంపేస్తారంటూ సందేశం ఇచ్చాడు. ఇంకా హత్య వెనక నయీం గ్యాంగ్ హస్తముందని అమృత ఆరోపించినట్టుగానే హత్యకు పాల్పడిన నిందితుల్లో నయీం గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు గుర్తించారు.
గతంలో నయీంకు ముఖ్య అనుచరుడిగా ఉన్న అబ్దుల్ బారీ ఈ హత్యకు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి స్ధాయిలో రెక్కి నిర్వహించిన తర్వాత 20 రోజుల క్రితం డీల్ కుదిరినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన గుజరాత్ హోంమంత్రి హిరేన్ పాండే కేసులో అబ్దుల్ బారీ జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. దీంతో అమృత తండ్రి మారుతీరావుకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రణయ్ హత్యను సెలెబ్రిటీలు ఖండిస్తున్నారు. మిర్యాలగూడ పరువు హత్య ఘటనపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నా ఇంకా ఇలాంటి మూస ఆలోచనలను పట్టించుకోవడం ఏంటని ప్రశ్నించింది. కుమార్తె అమృతను పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ను వేరే కులం వాడన్న కారణంగా మామ మారుతీరావు కిరాతకంగా హత్య చేయించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేస్తోందని పూనమ్ చెప్పింది. ఇప్పటికే మంచు మనోజ్, చిన్మయిలు ప్రణయ్ ఘటనను తీవ్రంగా ఖండించారు.
మరోవైపు కులాంతర వివాహం చేసుకుని హత్యకు గురైన ప్రణయ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ దిద్దుపాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రణయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నేత కరీంను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.