ఇజ్రాయెల్‌కు చెందిన స్పైస్ సంస్థ పెగాసస్ లక్ష్య జాబితాలో దేశానికి చెందిన అనేక మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సిబిఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ, దసాల్ట్ ఏవియేషన్ ప్రతినిధి వెంకట రావు ఇలా అనేక మంది ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.
వీరితో పాటు ఫాబ్ ఇండియా మాజీ హెడ్ ఇందర్ జిత్ సియాల్, బోయింగ్ ఇండియా బాస్ ప్రత్యూష్ కుమార్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు వైర్ తెలిపింది. అనిల్ అంబానీ ఫోన్ కూడా పెగాసస్ లిస్టులో ఉన్నట్టు వచ్చిన వార్తలపై రిలయన్స్ గ్రూప్ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వార్తలను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది.
కాగా, దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు, సుమారు 40 మంది జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సహా మొత్తం 300 మంది పెగాసస్ లిస్టులో ఉన్నట్టు వచ్చిన వార్తలు దేశాన్ని కుదిపివేస్తున్నాయి. దీనిపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుక పడుతున్నాయి.