మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉంది. శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న ఆయనను సోమవారం ఎయిమ్స్‌లో చేరగా, ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతలూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు తరలి వస్తున్నారు.
ఇదిలావుండగా, వాజపేయి ఆరోగ్యపరిస్థితిని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరా పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎయిమ్స్.. సాయంత్రం ఆస్పత్రి వర్గాలు ఎలాంటి బులెటిన్ విడుదల చేయకపోవడం గమనార్హం.
వాజపేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అశ్విన్ కుమార్ చౌబే, సాధ్వీ నిరంజన్ జోషి, అనంత్ గీతే, మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి ఎయిమ్స్‌కు వచ్చి వాజపేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.