ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ ఫలితాల సరళిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఆయన బుధవారం పార్లమెంట్ వద్ద స్పందిస్తూ... 'ఎస్పీ-బీఎస్పీ చేతులు కలపడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని నేను భావించడం లేదు. శ్రీరాముడిని అవమానించిన ఎస్పీ నాయకుడికి మీరు ఎర్రతివాచీ పరిచిన రోజే... దేవుడు మీ నుంచి ముఖం తిప్పుకున్నాడు...' అంటూ వ్యాఖ్యానించారు.
కాగా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం రాకపోవడంతో... ఆ పార్టీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు, ఎస్పీ ఎమ్మెల్యే నితిన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున జయాబచ్చన్ రాజ్యసభకు నామినేషన్ వేయగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలో చేరుతూ చేరుతూనే జయాబచ్చన్‌పై నరేశ్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇపుడు ఊహించని ఫలితాలపై కమలనాథులు షాక్‌కు గురయ్యారు.