కృష్ణ జింకల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దోషిగా తేలారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేలు నిర్దోషులుగా తేలారు. ఈ మేరకు జోధ్‌పూర్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది.
గత 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్‌పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడాడు. దీనిప కేసు నమోదు చేయగా, ఈ కేసు విచారణ కొన్నేళ్లుగా సాగుతూ వచ్చింది. ఈ కేసును విచారిస్తూ వచ్చిన కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఇందులో సల్మాన్ ఖాన్ దోషేనని తేల్చింది.
అదేసమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు సైఫ్ అలీ ఖాన్, సీనియర్ నటీమణులు సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని చెప్పారు. మరోవైపు, ఈ కేసులో అప్పీల్ చేసేందుకు సల్మాన్ తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు.