వ్యాక్సిన్లలో 'బాహుబలి' : అన్ని కరోనా వైరస్‌లకు 'జెట్' సూదితో చెక్!

బుధవారం, 26 ఆగస్టు 2020 (18:50 IST)
అన్ని రకాల వైరస్‌లను అంతం చేసేందుకు బ్రిటన్ అద్భుతమైన అస్త్రాన్ని ప్రయోగించింది. వ్యాక్సిన్లలో బాహుబలి లాంటి వ్యాక్సిన్‌ను యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జి తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ కరోనా రాకుండా అడ్డుకోవడంతో పాటు భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు వ్యాధి సోకకుండా ఉండేందుకు అవసరైన వ్యాధి నిరోధకశక్తిని కూడా మనిషి శరీరంలో పెంచుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వ్యాక్సిన్‌కు "డియో కో వ్యాక్స్ 2" అని పేరు పెట్టారు. 
 
గబ్బిలాల నుంచి ఇతర జంతువుల నుంచి కరోనా వైరస్ సంక్రమించే జన్యుపరమైన పరిణామాలను అధ్యయనం చేసి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఇంకో స్పెషాలిటీ ఉంది. జెట్ ఇంజెక్షన్‌తో నొప్పిలేకుండా చర్మంలో నుంచి శరీరంలోకి ఈ వ్యాక్సిన్‌ని ఇవ్వొచ్చు. 3డీ కంప్యూటర్ మోడలింగ్‌తో ఈ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నారు. 
 
సార్స్, మెర్స్ వంటి కరోనా వైరస్‌లు జంతువుల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇవి మనుషులకు సంక్రమిస్తాయని కేంబ్రిడ్జి పరిశోధకులు చెపుతున్నారు. జంతువుల నుంచి కరోనా వైరస్ మనుషులకు సంక్రమించకుండా చూడటమే ఈ వ్యాక్సిన్ ముఖ్యోద్దేశమని చెబుతున్నారు. 
 
మనషుల్లో కరోనా వైరస్ సంక్రమించకుండా వ్యాధి నిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ రూపొందిస్తుందని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయగానే, ఈయేడాది ఆఖరు నాటికి ట్రయల్స్ ప్రారంభమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు