ట్రాఫిక్ జరిమానాల్లో రిలీఫ్.. గుజరాత్ అదుర్స్.. ఆ బాటలోనే ఇతర రాష్ట్రాలు...

శనివారం, 14 సెప్టెంబరు 2019 (13:09 IST)
గుజరాత్ సర్కారు కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేసిన వారికి విధించే జరిమానాలను గణనీయంగా తగ్గించింది. ఈ చట్టం కింద దేశ వ్యాప్తంగా భారీగా జరిమానాలు వసూలు చేస్తుండగా.. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ మాత్రం రాష్ట్రంలో జరిమానాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఏకంగా 90శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా వెయ్యి రూపాయలు కాగా దాన్ని రూ.500కు తగ్గించారు. సీటు బెల్టు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయిలు జరిమానా విధించాల్సి ఉండగా గుజరాత్‌ ప్రభుత్వం దాన్ని రూ. 500కు తగ్గించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే బైక్‌లకు రూ.2 వేలు, ఇతర వాహనాలకు రూ.3 వేలు జరిమానా విధించనున్నారు. 
 
నూతన చట్టం కింద దేశంలోని ఇతర ప్రాంతాల్లో దీనికి రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు. జరిమానాలను తగ్గిస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వాహనదారుల్లో సంతోషాన్ని నింపింది.
 
గుజరాత్‌ తరహాలోనే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ట్రాఫిక్ జరిమానాలు తగ్గించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు జరిమానాలు తగ్గించుకోవచ్చని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఉత్తరాఖండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు కొంత రిలీఫ్ దక్కింది. 
 
ఇక చలాన్లను సగానికి తగ్గించాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కాగా కొత్త మోటారు వాహనం చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు