నగరంలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ అని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 31 మార్చి 1945లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలుగా రికార్డయిందని, ఆ తర్వాత దేశ రాజధానిలో మార్చిలో ఇదే అత్యంత ఉష్ణోగ్రత ఉన్న రోజని చెప్పారు.
అయితే గత మూడు నాలుగు రోజులుగా ఆకాశం నిర్మలంగా ఉండడం, గాలివేగం తక్కువగా ఉండడంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. 1973, మార్చి 29న నగరంలో గరిష్ఠంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది మార్చిలో మూడో అత్యంత వేడిమి ఉన్న రోజన్నారు. నజాఫ్‌గఢ్, నరేలా, పిటాంపురా, పూసాలోని వాతావరణ కేందాల్లోవరుసగా 41.8 నుంచి 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ పేర్కొంది.
ఇదిలావుండగా, నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.6 డిగ్రీలకు చేరాయి. ఇదిసాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ. సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే.. హీట్ వేవ్‌గా ప్రకటిస్తారు. సాధారణ ఉష్ణోగ్రత నుంచి 6.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.