ఆ ఇంటిని ఆలయంగా మార్చాలి .. స్థానికుల డిమాండ్

శుక్రవారం, 6 జులై 2018 (11:40 IST)
ఢిల్లీలో సంచలనం సృష్టించిన 11 మంది సామూహిక అత్మహత్యల వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు మెల్లగా ఛేదిస్తున్నారు. మరోవైపు, ఈ ఇంటిని ఆలయంగా మార్చాలని స్థానికుల వైపు నుంచి డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.
 
నిజానికి సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ కుటుంబం మరణోదంతంతో దర్యాప్తు చేసే కొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిన్నటికి నిన్న ఓ సీసీటీవీ ఫుటేజ్‌ బయటకొచ్చింది. చనిపోడానికి కొద్ది గంటల ముందు ఆ కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆత్మహత్యల కోసం స్టూలు, వైర్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 
 
ఇదంతా కాసేపు పక్కనబెడితే.. ఆ 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఏం చేయనున్నారు..? అనేది తాజాగా చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్‌ దేవి కుటుంబం గత శనివారం అర్ధరాత్రి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. 
 
ఆదివారం ఈ విషయం వెలుగులోకి రాగా.. అప్పటి నుంచి పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా.. కుటుంబంలోని 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికితోడు ఆత్మహత్య వెనుక కారణాలు మీడియాలో ప్రసారం కావడం, పోలీసులు రోజూ ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తుండటంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. 
 
ప్రస్తుతం నారాయణ్‌ దేవి ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. మరి దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారు అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చితేనే మంచిదని కొందరు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 'ఆ ఇంటికి తీసుకోడానికి బంధువులెవరూ ముందు రావట్లేదు. అమ్మినా ఎవరూ కొనుగోలు చేయడానికి సాహసించరు. అందుకే దాన్ని ఆలయంగా మార్చితే బాగుంటుంది' అని స్థానికులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు