ఉత్తర భారతదేశం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతోంది. ముఖ్యంగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కారణంగా యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది.
యమునా ప్రమాదకర హెచ్చరిక 204 మీటర్లు కాగా, డేంజర్ లెవల్ మార్క్ 204.50 మీటర్లు. సోమవారం ఉదయం లెక్కల ప్రకారం ఇది 204.70 మీటర్ల వద్ద వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. గంట గంటకు వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు ప్రారంభించి, దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన అప్రమత్తం చేశారు.