ఢిల్లీ శివారు ప్రాంతమైన గుర్‌గ్రామ్‌లో దారుణం జరిగింది. రెండేళ్లుగా ఓ న్యాయమూర్తి వద్ద సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న మహిపాల్ సింగ్ అనే వ్యక్తి, నడిరోడ్డుపై న్యాయమూర్తి భార్య, కుమారుడుపై సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత జడ్జికి ఫోన్ చేసి 'భార్య, కుమారుడిని కాల్చాను' అని చెప్పాడు.
స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, అదనపు సెషన్స్ న్యాయమూర్తిగా ఉన్న కిషన్ కాంత్ శర్మ వద్ద మహిపాల్ సింగ్ అనే వ్యక్తి సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రీతూ (38), కుమారుడు ధ్రువ్ (18) ఉన్నారు. వారిద్దరూ షాపింగ్‌కు వెళ్లిన వేళ, భద్రత కోసం మహిపాల్ కూడా వెళ్లాడు.
న్యాయమూర్తికి ఫోన్ చేసేందుకు క్షణాల ముందు వారిద్దరిపైనా తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రీతూ, ధ్రువ్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణాలతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై గురుగ్రామ్ తూర్పు డీసీపీ సులోచనా గుజ్రాల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.