తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విధించిన సభ్యత్వాల రద్దును హైకోర్టు ఎత్తేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు కొనసాగుతాయని తీర్పు వెల్లడించింది.
వారి సభ్యత్వం ఎప్పటి వరకు ఉందో... అప్పటి వరకు పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై దాడికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ తీర్పు అడ్డంకి కాబోదని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
కాగా, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పును వెలువరించింది .