అత్యాచారం జరిగిందని అబద్ధం చెప్తారా? శరీరంపై గాయాలు లేకపోతే?

ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (11:46 IST)
అత్యాచార బాధితురాలు అబద్ధాలు చెప్పరని బాంబే హైకోర్టు తెలిపింది. ఓ పరువుగల కుటుంబం నుంచి వచ్చిన యువతి తనపై అత్యాచారం జరిగిందని చెప్పదని హైకోర్టు వెల్లడించింది. అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడం ఆలస్యమైనంత మాత్రాన నిందితులు తప్పించుకోలేరని నలుగురు వ్యక్తులకు సెషన్స్ కోర్టు విధించిన పది సంవత్సరాల శిక్షను బాంబే హైకోర్టు ఖరారు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. 2012 మార్చి 15న తన స్నేహితుడితో కలసి నాసిక్ వెళుతున్న మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే పరువుపోతుందనే భయంతో ఆగి.. రెండు రోజుల తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇలా రెండురోజుల తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయగా విచారణ జరిపిన సెషన్స్ కోర్టు 2013 ఏప్రిల్‌లో పదేళ్ల శిక్ష విధించింది.
 
అయితే బాధితురాలి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, ఆమెపై ఎలా అత్యాచారం జరిగివుంటుందని నిందితులు బాంబే హైకోర్టులో అప్పీల్ చేశారు. విచారణలో నిందితులను వారి లాయర్లు వెనకేసుకొచ్చారు. దీనిపై వాదనలు విన్న అనంతరం హైకోర్టు నిందితులకు ఝలక్ ఇచ్చింది. 
 
తల్లిదండ్రుల పరువు పోతుందన్న భయంతో బాధితురాలు రెండు రోజులు ఫిర్యాదు చేసివుండకపోవచ్చునని.. శరీరంపై గాయాలు లేకుంటే లైంగిక చర్యలు జరగలేదని చెప్పలేమని.. ఫిర్యాదు ఆలస్యమైనా.. అత్యాచారం విషయంలో భారత మహిళలు అబద్ధాలు చెప్పరని హైకోర్టు స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు