112 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ‘బిగ్ బాస్ సీజన్ 2’ రియాలిటీ షోలో కౌశల్ విజేతగా నిలిచాడు. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన సీజన్ 2లో మొత్తం 18 మంది కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. 112 రోజుల పాటు విజయవంతంగా తమ జర్నీని కొనసాగించిన ఐదుగురు సభ్యులు మాత్రమే చివరికి ఫైనలిస్ట్‌లో మిగిలారు.
గ్రాండ్ ఫైనల్‌కు ఐదుగురు సభ్యలు కౌశల్, గీతా మాధురి, తనీష్, సామ్రాట్, దీప్తిలు వచ్చారు. తనీష్, సామ్రాట్, దీప్తిలు ఎలిమినేట్ అయ్యి గీత, కౌశల్ మాత్రమే ఫైనల్ కాంటెస్ట్‌కి వచ్చినా తుది పోరులో బిగ్‌బాస్ తెలుగు -2 విజేతగా కౌశల్ నిలిచాడు. దాదాపు 26 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్‌లకు రాగా, ఇందులో దాదాపు 12 కోట్ల ఓట్లు ఒక్క కౌశల్‌కే రావడంతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు కౌశల్.
కౌశల్ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు. హౌస్‌లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌ల్లో కౌశల్ తనదైన ముద్ర వేశాడు. కౌశల్ ఓ నటుడిగా బిగ్‌బాస్ హౌస్‌లోనికి అడుగుపెట్టినా అతని వ్యక్తిత్వం, ముక్కుసూటితనంతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్నాడు కౌశల్. బిగ్ బాస్ విజేతగా కౌశల్ నిలవడంతో అతని అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.