రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో పెట్రోల్ కొరత ఏర్పడింది. ఇక్కడి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకుల్లో పెట్రోల్ కొరతి ఏర్పడింది. దీంతో ఐఓసీ బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు కిలోమీటర్ మేర క్యూ కట్టారు. వాహనదారులు ఇంత భారీ సంఖ్యలో గుమికూడటం వల్ల పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నమే స్టాక్ అయిపోవడం వల్ల జైపుర్‌లో పెట్రోల్, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో సాయంత్రం నుంచి నగరంలోని ఐఓసీఎల్ బంకుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
ప్రస్తుతం ఐఓసీఎల్ బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది. రద్దీ దృష్ట్యా బంకు నిర్వాహకులు ఒక్కో వాహనంలో రూ.100 వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపుతున్నారు. గత్యంతరం లేక ప్రజలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడి ఎంతో కొంత ఇంధనాన్ని ట్యాంకుల్లో నింపుకుంటున్నారు.
ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు వేలకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో రెండు, మూడు వేల బంకులు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌కు చెందినవే కావడం గమనార్హం. అయితే కొద్ది కాలంగా వీటికి ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. రాజస్థాన్‌లో రోజుకు సగటున 25 లక్షల లీటర్ల పెట్రోల్, కోటి లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. వీటిలో 50 శాతం ఐఓసీఎల్ బంకుల నుంచే విక్రయం అవుతోంది.