ఈ సంఘటన ఆదిలాబాద్, భోరజ్ మండల పరిధిలోని నిరాల గ్రామంలో జరిగింది. నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి ఆరుబయట గూటానికి కట్టేశాడు. ఆదివారం ఉదయం కొన్ని కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో ప్రాణభయంతో కట్టుతాళ్లను తెంచుకుని పక్కనే ఉన్న రాళ్ల కట్టపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరింది.
ఇంటిపై ఎద్దు ఉండటాన్ని చూసి గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆపై చాలాసేపు శ్రమించి, తాళ్ల సాయంతో ఎద్దును జాగ్రత్తగా కిందికి దించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన విఠల్ మాస్టర్ అనే వ్యక్తి ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.