తూర్పు లడాఖ్‌లో యుద్ధ వాతావరణం - భారీగా భారత బలగాలు తరలింపు

శనివారం, 20 జూన్ 2020 (16:38 IST)
చర్చల పేరుతో 20 మంది భారత సైనికులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అత్యంత క్రూరంగా చంపేసింది. ఈ దుశ్చర్యపై దేశం యావత్తూ తీవ్రంగా మండిపడుతోంది. ఈ క్రమంలో లడాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ తమదేనని చైనా తాజాగా ప్రకటించింది. ఇది పుండుమీద కారం చల్లినట్టయింది. ఈ ప్రకటన భారత్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. అంతే.. ఇకేమాత్రం ఆలస్యం చేయరాదని భావించిన భారత్.. లడాఖ్ ప్రాంతానికి భారీ ఎత్తున బలగాలు తరలిస్తోంది. దీంతో భారత్ - చైనా సరిహద్దు ప్రాంతం వద్ద పరిస్థితి గంభీరంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. 
 
గాల్వాన్ లోయ మాదేనంటూ చైనా తొలిసారిగా ప్రకటించడాన్ని భారత్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దేశ రక్షణ విషయంలో రాజీ పడేలేదన్న ప్రాధాని ప్రకటన స్ఫూర్తితో వాస్తవాధీన రేఖ వద్ద భారత్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. ఇప్పటికే భారత వాయు సేన రంగంలోకి దిగింది.
 
అత్యంత భీకరమైన సుఖోయ్-30, మిరాజ్-2000.. వంటి ఫైటర్ జెట్లను శ్రీనగర్, అవంతీపుర, లేహ్ ప్రాంతాలకు తరలించింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల వద్దా గస్తీని ముమ్మరం చేసింది. అమెరికా నుంచి దిగుమతి అపాచీ హెటికాఫ్టర్‌లనూ రంగంలోకి దింపింది.
 
మరోవైపు, గగనతలంలోనే కాకుండా.. భూభాగంపై కూడా భారీ సంఖ్యలో సైనికులను మొహరించింది. గగనతలంలో ఫైటర్ జట్ల గస్తీతో వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. 
 
ఇంకోవైపు, భారత్ నౌకా దళం కూడా అప్రమత్తమైంది. హిందూ సముద్ర జలాలపై గట్టి నిఘా పెట్టింది. ఇక సరిహద్దు వద్ద చైనా కూడా భారీగా భద్రతా దళాలను మోహరిస్తోంది. గల్వాన్ లోయకు సమీపంలో భారీగా సైనికులు, యుద్ధవిమానాలను రప్పిస్తోంది. దీంతో సరిహద్దు వద్ద పరిస్థితి అత్యంత గంభీరంగా మారింది. 
 
ఇదిలావుంటే భారత వాయుసేన అధిపతి ఆర్.కె.ఎస్.బధూరియా తనదైనశైలిలో హెచ్చరికలు చేశారు. భారత, చైనా మధ్య తలెత్తిన ఘర్షణాత్మక వైఖరిని తాము శాంతియుతంగానే పరిష్కరించడానికి శతధా ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే, కవ్వింపు చర్యలకు దిగితే మాత్రం అదే రీతిలో సమాధానం చెప్పే సత్తా తమకుందని హెచ్చరించారు. 
 
హైదరాబాద్ నగరంలోని దుండిగల్‌లో ఉన్న ఏయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. భారత రక్షణ దళాలు మాత్రం సర్వ సన్నద్ధంగానే ఉన్నాయని, ఎలాంటి సవాల్‌పైనా స్పందించడానికి సిద్ధంగానే ఉన్నాయన్నారు. గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన 20 మంది భారత జవాన్లకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, 'గాల్వన్ లోయలో ఎల్‌ఐసిని కాపాడడానికి కల్నల్ సంతోశ్ బాబుతో పాటు వారి టీం అత్యున్నత త్యాగం చేసింది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో వారి సంకల్పాన్ని ప్రదర్శించారు. అత్యంత క్లిష్టమైన, సవాళ్ల మధ్య వారు తమ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దేశ సార్వభౌమత్వాన్ని ఎలాగైనా కాపాడాలన్న దృఢ సంకల్పంతోనే పోరాడారు. 
 
దేనికైనా సరే మనం సిద్ధంగానే ఉండాలి. సరిహద్దుల్లో బలగాలు ఏం జరిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉంటాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. సరిహద్దుల వద్ద అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. భారత భద్రతా దళాల సత్తాపై ఏ విధమైన శంక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని సవాళ్లెదురైనా దేశ సేవే మన ప్రథమ కర్తవ్యం' అని బధూరియా స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు