ఆ సత్తా భారత్‌కే ఉంది... ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగలదు: బిల్ గేట్స్

శుక్రవారం, 17 జులై 2020 (09:22 IST)
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. ఈ వైరస్ బారినుంచి బయటపడేందుకు అనేక ప్రపంచ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. కానీ, ఏ ఒక్క దేశం కూడా ఇప్పటివరకు కరోనాకు వ్యాక్సిన్ లేదా మందును కనిపెట్టలేకపోతున్నాయి. అయితే, భారత్, అమెరికా, రష్యా, చైనా, సౌత్ కొరియా వంటి దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నాయి. ముఖ్యంగా, భారత్, రష్యా దేశాల్లో జరుగుతున్న పరిశోధనా ఫలితాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో ఆగస్టు నాటికి కరోనాకు వ్యాక్సిన్ వస్తుందన్న ఆశలు ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయగల సత్తా ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందని చెప్పారు. దీనికి కారణం ఆ దేశంలో ఫార్మా రంగం అంతలా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, భారత ఫార్మా రంగం ఎంతో విస్తరించిందని, కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ సిద్ధమైతే, ప్రపంచం మొత్తానికి సరిపడా స్థాయిలో తయారు చేయగల సత్తా ఉన్న దేశమన్నారు. 
 
కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా కంపెనీలు, మెడికల్ వర్శిటీలు ప్రయోగాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియా ఫార్మా పరిశ్రమ కూడా ఎంతో శ్రమిస్తోందని, భారీ ఎత్తున వ్యాక్సిన్‌ను తయారు చేయగల సామర్థ్యం భారతీయ ఫార్మా కంపెనీలకు మాత్రమే ఉందని చెప్పారు. 
 
ఒకసారి వ్యాక్సిన్ బయటకు వస్తే, ఉత్పత్తి కోసం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తాజాగా 'కోవిడ్-19: ఇండియాస్ వార్ ఎగనెస్ట్ ది వైరస్' అనే డాక్యుమెంటరీ కోసం మాట్లాడిన ఆయన, ఈ వైరస్ ఎన్నో సవాళ్లను ప్రపంచం ముందు ఉంచిందన్నారు.
 
"ఇండియా ఫార్మా రంగం ఎంతో శక్తిమంతమైనది. ఇక్కడి కంపెనీలు కేవలం భారత దేశానికే కాదు... ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్‌ను పంపించగలవు. ప్రపంచ దేశాలు తయారు చేస్తున్న అన్ని ఔషధాలు, వ్యాక్సిన్‌ల పరిమాణంతో పోలిస్తే, ఇండియాలోనే అధికంగా ఫార్మా ఉత్పత్తులు తయారవుతున్నాయి. 
 
ఈ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ముందుంది' అని గేట్స్ గుర్తుచేశారు. సీరమ్‌తో పాటు బయో-ఈ, భారత్ బయోటెక్ వంటి ఎన్నో కంపెనీలు ఇండియాలో ఉన్నాయని అన్నారు. భారత ప్రభుత్వంతో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం అయిందన్నారు. 
 
ముఖ్యంగా బయో టెక్నాలజీ విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)తో కలసి పని చేస్తోందని తెలిపారు. కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ ఇండియా తొలి దశలోనే ఉన్నదని, మరింత జాగ్రత్తగా ఉంటే వైరస్‌ను విస్తరించకుండా ఆపవచ్చని సూచించారు.
 
భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో జనసాంధ్రతను గుర్తు చేసిన ఆయన, ఇండియా ముందున్న పెను సవాలు ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రజలు చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటారని, వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజల్లోనూ అవగాహన పెరిగిందని అన్నారు. గతంలో తాము ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలు నిర్వహించామని, ఈ రాష్ట్రాల్లో ఇప్పటికీ తమ ఫౌండేషన్ యాక్టివ్‌గా ఉందని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు