విహార నౌకను కొనుగోలు చేసిన అపర కుబేరుడు

సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (10:15 IST)
ప్రపంచంలో రెండో సంపన్నుడుగా పేరుగాంచిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. అత్యంత విలాసవంతమైన నౌకను కొనుగోలు చేశారు. ఈ నౌక విలువ రూ.4600 కోట్లు. పేరు అక్వా. 370 అడుగుల పొడవు ఉండే ఈ నౌకల్ నాలుగు గెస్ట్‌ రూములు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్‌ ఉంటాయి. ఈ నౌక ద్రవ హైడ్రోజన్‌తో నడుస్తుంది. 
 
గత ఏడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో ఆయన దీని నమూనాను చూసి ముచ్చటపడ్డారు. ఆ నమూనా ప్రతిపాదన మాత్రమే. అయితే, అది పర్యావరణానికి ఎలాంటి హానీ చేయని విధంగా ద్రవ హైడ్రోజన్‌తో నడుస్తుందని తెలియడంతో వెంటనే తయారీకి కావాల్సిన డబ్బును బిల్‌గేట్స్‌ ఇచ్చేశారు. ఇప్పటిదాకా ఆయనకు సొంత విహార నౌక లేదు. ఎప్పుడైనా కుటుంబంతో కలిసి నౌకలో విహరించాలనుకుంటే ప్రైవేట్‌ యాట్‌లను అద్దెకు తీసుకుంటారు. పర్యావరణంపై ప్రేమతోనే ఆయన ఇప్పుడు ఈ నౌకను కొనుగోలు చేశారని అంటున్నారు.
 
ఒక్కసారి ఈ నౌకలో ఇంధనాన్ని నింపితే ఏకంగా 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్‌ మైళ్లు. అలాగే, నౌక నడవడానికి ఉపయోగించే ద్రవ హైడ్రోజన్‌ను మైనస్‌ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2 ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఒక్కో ట్యాంకు సామర్థ్యం 28 టన్నులు. ఈ నౌక ప్రయాణించినప్పుడు కర్బన ఉద్గారాలూ వెలువడవు. కేవలం మాత్రమే నీళ్లు బయటకు వస్తాయి. 
 
ఈ నౌకలోని సిబ్బంది సంఖ్య 31. ఇందులో 14 మంది అతిథులు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లున్నాయి. ఇంకా.. కసరత్తులు చేయడానికి జిమ్‌, యోగాసనాలు వేసుకోవడానికి, ధ్యానానికి యోగా రూమ్‌, మేకప్‌ రూమ్‌, మసాజ్‌పార్లర్‌, స్విమ్మింగ్‌పూల్‌ కూడా ఉన్నాయి.
 
ఈ విలాసవంతమైన నౌకలో నుంచి బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు ఉంటాయి. ఒక్కోదాని పొడుగు 32 అడుగులు. ఈ నౌక తయారీ దశలో ఉంది. 2024 నాటికి బిల్‌గేట్స్‌ చేతికి రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు