రష్యాకి భారత్-చైనాలు ఫోన్: దిగివచ్చిన పుతిన్, ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం అంటూ ప్రకటన

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (20:02 IST)
కేవలం 48 గంటల్లో ఉక్రెయిన్ దేశంలో మారణహోమం సృష్టించింది రష్యా. ప్రపంచం తేరుకునేలోపలే ఉక్రెయిన్ దేశాన్ని చావుదెబ్బ తీసింది. దేశంలోని ప్రధాన నగరాలపై వరుస దాడులు చేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది. దీనితో ఉక్రెయిన్ పౌరుల రోదనలు, ఆర్తనాదాలు, దిక్కుతోచని విధంగా పసిబిడ్డలతో రోడ్లపై పరుగులు పెడుతూ కనిపించారు. ఆ దృశ్యాలను చూసిన ప్రపంచ దేశాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి.

 
నాటో గ్రూప్ సభ్య దేశాలు చెప్పిన మాటలను రష్యా ఏమాత్రం లెక్కచేయకుండా ఉక్రెయిన్ పైన విరుచుకుపడింది. ఈ క్రమంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఫోన్ చేశారు. హింసను తక్షణమే ఆపివేయాలనీ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైతం రష్యా అధ్యక్షుడితో ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది గంటలకే పుతిన్ దిగివచ్చారు. ఉక్రెయిన్ దేశంతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఐతే ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలను వీడాలని, సామరస్య వాతావరణంలో తాము చర్చలకు సిద్ధమని తెలిపారు.

రష్యా అధినేత పుతిన్‌కు ఇంటి సెగ - రష్యాలో నిరసన ర్యాలీలు
ఉక్రెయిన్ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు సొంత దేశంలోనే వ్యతిరేక నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అనేక మంది రష్యన్లు పుతిన్ వైఖరికి నిరసనగా రష్యాలో గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాజాగా ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం వద్ద కూడా నిరసన ర్యాలీ జరిగింది. 

 
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించగానే, ఆ దేశానికి చెందిన అన్ని రాయబార కార్యాలయాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం వద్ద కూడా పటిష్టమైన భద్రతను కల్పించారు. 

 
అయితే, శుక్రవారం సాయంత్రం ఓ యువ జంట ఆ భద్రతా వలయాన్ని దాటుకుని రష్యా హైకమిషన్ వద్ద ఉక్రెయిన్‌ జెండా పట్టుకుని ప్రత్యక్షమయ్యారు. దీంతో షాక్ తిన్న పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఉక్రెయిన్‌పై పుతిన్ దాడికి తెగబడటం ఏకపక్ష చర్యగా అనేక మంది అభివర్ణిస్తున్నారు. దీంతో ఆయన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు