జయలలిత ఎపుడైనా గర్భందాల్చిందా? అమృత ఎలా పుట్టింది?

బుధవారం, 25 జులై 2018 (11:32 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవించివున్న సమయంలో ఎపుడైనా గర్భందాల్చిందా? లేదా? అనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. తనను జయలలిత కుమార్తెగా గుర్తించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
 
దీనికి తమిళనాడు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలైంది. ఇందులో అమ్మ (జయలలిత) తన జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు స్పష్టంచేసింది. కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కొన్ని వీడియో క్లిప్పింగ్‌ను కోర్టుకు సమర్పించారు. 
 
పిటిషనర్‌ కేవలం ఆస్తి కోసమే ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ అమృత జయలలిత కూతురు అయితే ఆమెతో ఉన్న ఒక్క ఫొటోను కూడా కోర్టుకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. అమృత, జయలలిత కూతురని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. 
 
1980లో తను జన్మించినట్టు అమృత తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆమె పుట్టిన తేదీకి నెల రోజుల ముందు ఓ అవార్డు కార్యక్రమంలో జయలలిత పాల్గొన్న వీడియోలను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు అందజేశారు. 
 
ఆ వీడియోల్లో జయలలిత గర్భంతో ఉన్నారని అనడానికి ఎటువంటి అనవాళ్లు లేవని కోర్టుకు విన్నవించారు. అమృత కోరినట్టు డీఎన్‌ఏ టెస్ట్‌ కావాలంటే.. జయలలిత బంధువులు ఉన్నారని ఆయన తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు