కన్నబిడ్డ కోసం చిరుత పులిని తరిమికొట్టింది.. పెద్ద కర్ర పట్టుకుని..

బుధవారం, 1 డిశెంబరు 2021 (13:58 IST)
కన్నబిడ్డ కోసం ఎంతో సాహసం చేసింది... ఆ తల్లి. తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టింది. చిరుత నోట కరుచుకున్న తన కొడుకు కోసం ఏకంగా చిరుతపులితో పోరాడి, దాదాపు కిలోమీటరు దూరం అడవిలో చిరుతపులితో పాటు పరిగెత్తి తన కొడుకును రక్షించుకున్న ఘటన మధ్యప్రదేశ్​లోని సిద్ధి జిల్లాలోని బరిజహారియా గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో ఆ తల్లికి తీవ్ర గాయాలైనా తన కొడుకును కాపాడుకున్న సంతోషంలో ఆ గాయాల బాధను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ తల్లీకుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్​లోని సిద్ధి జిల్లాలోని బరిజహారియా గ్రామంలో బైగా తెగకు చెందిన కిరణ్​ అనే మహిళ ఆదివారం సాయంత్రం తన ఇంటి బయట వంట చేస్తోంది. తన ఎనిమిదేళ్ల కొడుకు రాహుల్ అక్కడే ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఓ చిరుతపులి అక్కడకు వచ్చి రాహుల్‌ను నోట కరుచుకుని పరిగెత్తింది. 
 
ఆ దృశ్యాన్ని చూసిన కిరణ్ కూడా చిరుతపులి వెంట పెద్ద కర్ర పట్టుకుని పరిగెత్తింది. చిరుతతో పోరాడి కుమారుడిని రక్షించింది. తల్లిబిడ్డలపై చిరుత దాడి చేస్తుండగా.. అంతలోనే గ్రామస్థులు వచ్చి దానిని తరిమికొట్టారు. కన్నబిడ్డ కోసం చిరుత పులితో పోరాడిన మహిళ పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు