రాజకీయాలలో వారిద్దరూ ఫైర్ బ్రాండ్స్. ఒకరు అధికార పార్టీలో అమాత్యుడు. మరోకరు ప్రతిపక్షంలో అత్యంత కీలక వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించే మూడు సామాజిక వర్గాలలోని రెండింటికి వీరు ప్రతినిధులు. కాని ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విధాన పరమైన నిర్ణయాల విషయంలో వీరిద్దరు శత్రువులే. కాని మంచి మిత్రులు.
వారి ఛాయాచిత్రాలను చూసినప్పుడు తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు వీరిని ఎవ్వరూ పరిచయం చేయనవసరం లేదు. వారిలో ఒకరు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మరొకరు వంగవీటి రాధాకృష్ణ (రాధా). రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు అని భావించే వీరిరువురు శనివారం గుడివాడలో కలిసారు. సీనియర్ రాజకీయ నాయకుడు అడపా వెంకట రమణ (బాబ్జి) ఆకస్మిక మృతి నేపధ్యంలో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నివాళి అర్పించారు.
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది జగమెరిగిన నానుడి. అదే నిజం కాబోతుందేమో. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుడివాడ తెలుగుదేశం నాయకులతో వంగవీటి ఇంతలా కలివిడిగా ఉన్న దృశ్యాలు మనకు కనిపించవు. ప్రతిపక్షంపై విరుచుకుపడే కొడాలికి, ఆ ప్రతిపక్షంలో క్రియాశీలకంగా వ్యవహరించే వంగవీటికి మధ్య ఉన్న ఈ అనుబంధం రేపటి రాష్ట్ర రాజకీయాల దిశాదశలను మార్చినా ఆశ్చర్యం లేదు.