మోడీకి వెన్నుదన్నుగా నిలిచిన ప్రణబ్ - భారత్ క్షోభిస్తోందంటూ ప్రధాని ట్వీట్

సోమవారం, 31 ఆగస్టు 2020 (18:53 IST)
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఢిల్లీకి కొత్త అయిన తనకు అన్ని విధాలా సహాయ సహకారాలందిస్తూ ప్రణబ్ నడిపించారని అప్పట్లో మోడీనే స్వయంగా వ్యాఖ్యానించారు. 
 
ప్రణబ్ పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతే అయినా రాష్ట్రపతి అయ్యాక ప్రధాని మోడీకి అన్ని విధాలా సహకరించారు. ఢిల్లీ స్థాయిలో పాలనాపరమైన అనుభవం లేని మోడీకి ప్రణబ్ అండగా నిలిచారు. 
 
నిజానికి బీజేపీకి చెందిన ప్రధాని కావడం వల్ల మోడీని రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ఇబ్బంది పెడతారేమో అని కొందరు ఊహించారు. అయితే అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటూ ప్రణబ్ తన పదవీకాలం పూర్తి చేసుకున్నారు. మోడీతో ఆయనకున్న సయోధ్య వల్లే ఇదంతా సాధ్యమైందని పరిశీలకులు చెబుతుంటారు.
 
ప్రణబ్ మృతిపై మోడీ తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అస్తమయంతో భారత్ క్షోభిస్తోందని పేర్కొన్నారు. దేశ అభివృద్థి పథయంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. సమున్నత ఎత్తులకు ఎదిగిన రాజనీతి కోవిదుడు, పండితుడు అంటూ కీర్తించారు. రాజకీయ చిత్రపటంలో అన్ని వర్గాల వారిని మెప్పించి, సమాజంలో అందరి మన్ననలలకు పాత్రుడయ్యారంటూ మోదీ ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు